ఇటీవల రజనీకాంత్ కి చెన్నై హైకోర్టు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. తన కల్యాణ మండపానికి పన్నుచెల్లింపులో మినహాయింపు ఇవ్వాలని కోర్టులో రజనీతరపు న్యాయవాది పిటీషన్ వేయడం, దానికి న్యాయస్థానం అక్షింతలు చల్లడం - హాట్ టాపిక్ అయ్యాయి. 6.5 లక్షల పన్నుమినహాయింపు కోసం రజనీలాంటి సూపర్ స్టార్ కోర్టు మెట్లెక్కడం చూసి జనాలంతా నవ్వుకున్నారు.
ఇప్పుడు ఆ పన్ను మొత్తం, పెనాల్టీతో సహా రజనీకాంత్ చెల్లించేశాడు. శుక్రవారమే మున్సిపల్ ఆఫీసులో పన్ను కట్టి, రసీదు తీసుకున్నారని తెలుస్తోంది. రజనీకాంత్ కి చెన్నైలో ఓ కల్యాణమండపం ఉంది. లాక్‌డౌన్ కారణంగా ఆరునెలలుగా ఆ కల్యాణ మండపం మూసే ఉంచారు. ఈ ఆరు నెలలకు గానూ 6.5 లక్షల పన్ను చెల్లించమని పురపాలక శాఖ నోటీసులు పంపింది. లాక్ డౌన్ కారణంగా కల్యాణ మండపం మూసే ఉంచామని, ఆదాయం లేనప్పుడు పన్ను ఎందుకు చెల్లించాలని, రజనీకాంత్ పిటీషన్ వేశారు. కోర్టు మందలించడంతో...ఆ పన్ను చెల్లించాల్సివచ్చింది.