రజనీ.. ఇండియన్ సూపర్ స్టార్. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకుడు. ఆ క్రేజ్‌తో ఆయన సంపాదించిన ఆస్తులు ఇంతా అంతా కాదు. అయితే అదంతా ఆయన స్వార్జితం, కష్టం. అయితే... దాన ధర్మాల విషయంలో ఆయన మరీ పిసినారితనం చూపిస్తుంటారని ఆయన గురించి తెలిసినవాళ్లంతా చెబుతుంటారు. అదీ నిజమే. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు రజనీకాంత్ భారీగా విరాళాలు ఇచ్చింది లేదు. విజయ్, కార్తి, సూర్య లాంటి వాళ్లు కోట్లలో విరాళాలు ఇస్తుంటే, రజనీ లక్షలకే పరిమితమైన సందర్భాలు కోకొల్లలు.
ఈ విషయమై... నాన్ రజనీ ఫ్యాన్స్ జోకులు కూడా వేసుకుంటుంటారు. తాజాగా... రజనీకాంత్ పిసినారితనం మరోసారి బయట పడింది. చెన్నైలో రజనీకాంత్ కి ఓ కల్యాణ మండపం ఉంది. దానికి ఆరు నెలలుగా పన్ను కట్టలేదు. దాంతో ఆరున్నర లక్షల పన్ను కట్టమని నగరపాలక సంస్థ నోటీసులు అందించింది. లాక్ డౌన్ సమయంలో... పన్ను ఎలా కడతామంటూ, తమకు మినహాయింపు ఇవ్వాలని రజనీకాంత్ తమిళనాడు హైకోర్టులో పిటీషన్ వేశారు. ఇలాంటి పిటీషన్ వేసిందుకు రజనీతరపు న్యాయవాదిని కోర్టు మందలించింది. పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వమనడం హాస్యాస్పదంగా ఉందని, ఇలాంటి పిటీషన్ వేసినందుకు, న్యాయ స్థానం సమయం వృథా చేసినందుకు జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దాంతో.. రజనీ తరపు న్యాయవాది వెంటనే పిటీషన్ ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.
లాక్ డౌన్ సమయంలో అందరూ బాధపడ్డారు. ముఖ్యంగా వ్యాపారస్తులు. పన్నులు కట్టలేని స్థితిలో కూడా..ప్రభుత్వానికి సహకరించారు. అలాంటిది రజనికీ ఎందుకు కష్టం అనిపించిందో? రజనీలాంటి వ్యక్తి, ఓ సూపర్ స్టార్, ఆరున్నల లక్షల పన్ను మినహాయించాలని కోర్టుకి ఎక్కడం నిజంగా వింతగానే ఉంది. ఆ మాత్రం డబ్బు రజనీ దగ్గర లేదా? ఈ మాత్రం పన్నుని చెల్లించలేని స్థితిలో ఉన్నాడా? అంటూ నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. రజనీ కోసం చందాలు సైతం వసూలు చేయాలని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.