ఈ వారం విడుదలైన రాజు గారి గది 2 చిత్రానికి ఒక ప్రాముఖ్యం ఏర్పడింది. అదేంటంటే- సమంతా... అక్కినేని వారి కోడలు అయిన తరువాత, అలాగే తన మామగారు అయిన నాగార్జున తో కలిసి నటించిన చిత్రం వంటి విషయాలతో ఈ సినిమా కథకి సంబంధం లేకుండా ఈ చిత్రానికి హైప్ వచ్చేసింది.
అయితే ఈ హైప్ తో పనిలేకుండా, ఈ చిత్రం ద్వారా మనకి దర్శకుడు ఓంకార్ చెప్పదలుచుకున్న కథలో బలం ఉండడంతో ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడి మనసు గెలుచుకోగలిగింది. ఈ సినిమా కథా వస్తువు ఇప్పుడు సమాజంలో జరుగుతున్న అకృత్యాలకు దగ్గరగా ఉండడమే ఈ చిత్రానికి ప్రధాన బలం అని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే, సినిమాలో ముఖ్య పాత్ర పోషించడానికి ఒప్పుకున్న నాగార్జునని అలాగే ఒక బాధ్యతతో కూడిన పాత్రని ఎంచుకున్న సమంతాని మనం తప్పక అభినందించాలి. వీరిద్దరూ ఈ చిత్రాన్ని మరింతమంది ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు.
అబ్బూరి రవి సంభాషణలు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, దివాకరన్ ఛాయాగ్రహణం ఈ చిత్రాన్ని నిలబెట్టాయి అని చెప్పాలి. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ చిత్రం బాగానే ఉండడంతో ‘మంచి కంటెంట్ ఉన్న సినిమాకి మంచి కలెక్షన్స్ తప్పక వస్తాయి’ అన్న మాట నిజమైంది.