బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌ని పోలీసులు అరెస్టు చేసినట్లుగా వార్తలు రాగా ఆమె అరెస్టు వార్తల్ని పోలీసు అధికారులు ఖండించారు. అయితే రాఖీ సావంత్ ఆచూకీ మాత్రం వెల్లడి కావడంలేదు. ఆమె సన్నిహితుల వెర్షన్ ప్రకారం, రాఖీ సావంత్ లొంగిపోయారని తెలియవస్తోంది. లొంగిపోతే పోలీసుల కస్టడీలోనే ఉండాలి. లేదా జైలుకు పంపబడాలి. పోలీసుల నుంచి రాఖీ సావంత్ ఆచూకీపై ఎలాంటి స్పష్టత లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇటువంటి వివాదాల్లో రాఖీసావంత్ చాలా తెలివిగా వ్యవహరిస్తుంటుంది. కాబట్టి రాఖీ సావంత్ పోలీసులతో ఆటలాడుతోందనే భావనకు రావొచ్చంటున్నారు ఆమె గురించి తెలిసినవారు. మహా కవి వాల్మీకిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో రాఖీ సావంత్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని రాఖీ సావంత్ చెబుతున్నప్పటికీ, విచారణ సందర్భంగా న్యాయస్థానం పలుమార్లు ఆమెకు నోటీసులు పంపినా పట్టించుకోకపోవడం వల్ల అరెస్ట్ వారెంట్‌ని జారీ చేయడం జరిగింది. ఇంకో వైపున రాఖీ సావంత్ అజ్ఞాతంలోకి వెళ్ళిందని పోలీసులు చెబుతున్న మాటలు నిజమే కావొచ్చునని బాలీవుడ్ సినీ జనాలు అనుమానిస్తున్నారు.