డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్‌పై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తికి రకుల్ ప్రీత్ సింగ్ అత్యంత సన్నిహితురాలంటూ కొన్ని వీడియోలు, ఫొటోలతో నేషనల్ మీడియా రచ్చ రచ్చ చేసేస్తోంది. ఈ విషయమై రకుల్ ప్రీత్ తాజాగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన చుట్టూ అర్థం పర్థం లేని ప్రచారం మీడియా చేస్తోందనీ, డ్రగ్స్ కేసులో తన పేరుని ఇరికించాలని ప్రయత్నిస్తోన్న మీడియాని నియంత్రించాలని రకుల్ ప్రీత్ సింగ్, న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గమనార్హం.
అయితే, మీడియాని న్యాయస్థానాలు ఎంతవరకు నియంత్రించగలవు? అన్న విషయమై భిన్నాభిప్రాయాలున్నాయి. సెలబ్రిటీల చుట్టూ క్రియేట్ చేసే గాసిప్స్‌కి విపరీతమైన క్రేజ్ వుండడంతో, మీడియా ఈ తరహా గాసిప్స్ పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టడం మామూలే. అయితే, ఇది చాలా సున్నితమైన విషయం. మీడియా ఇలాంటి విషయాల్లో స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, రియా చక్రవర్తి ఇంటరాగేషన్ సందర్భంగా, రకుల్ ప్రీత్ పేరు చెప్పిందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పటికే ప్రకటించింది.
ఈ నేపథ్యంలోనే రకుల్ ప్రీత్ పేరు డ్రగ్స్ కేసులో మరింత ప్రముఖంగా వినిపిస్తోంది. దాంతో, రకుల్ ప్రీత్‌కి న్యాయస్థానంలో ఊరట లభించడం అనేది కష్టసాధ్యమేనన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ అనుమానాస్పద మరణం కేసు విచారణ సందర్భంగా డ్రగ్స్ కేసు తెరపైకొచ్చిన సంగతి తెల్సిందే.