మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం `సన్నాఫ్ ఇండియా`. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంచుకున్నారని సమాచారం. రకుల్‌కి.. మంచు ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. మంచు లక్ష్మికి బెస్ట్ ఫ్రెండ్. ఆ కారణంతోనే.. ఈ సినిమాలో నటించడానికి రకుల్ మొగ్గు చూపిందని సమాచారం.
అయితే ఈ సినిమాలో రకుల్ హీరోయిన్ కాదు. ఓ ప్రధాన పాత్ర. టెక్నికల్ గా ఈ సినిమా స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకుంటున్నారు మోహన్ బాబు. అందుకే తనకు బాగా అచ్చొచ్చిన ఇళయరాజాని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ రోజు నుంచి హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. త్వరలోనే రకుల్ సెట్స్‌లో కి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. కొంతమంది బాలీవుడ్ నటీనటులు కూడా ఇందులో కనిపించే అవకాశాలున్నాయి.