మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా సినిమా 'సైరా నరసింహారెడ్డి' చుట్టూ ఎన్నో వివాదాలు ముసురుకుంటున్నాయి. దాంతో 'సైరా' టీమ్ అలర్ట్ అవక తప్పదు. సినిమాని కూల్‌గా, విషయాలేవీ బయటకు పొక్కకుండా పూర్తి చేసేస్తామంటే కుదరదు. నెగెటివ్ గాసిప్స్ కారణంగా 'సైరా'పై అంచనాలు తగ్గే అవకాశముంది. అందుకే నిర్మాత మెగా పవర్ స్టార్, దర్శకుడు సురేందర్‌రెడ్డి, 'సైరా' సినిమా అప్డేట్స్ మీడియాకి అందించాలని అనుకుంటున్నారట. అతి త్వరలోనే 'సైరా' అప్డేట్, ప్రెస్‌నోట్ రూపంలో రాబోతోందని సమాచారమ్.
నయనతార ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనీ, విజయ్‌సేతపతి కూడా 'సైరా'కి బైబై చెప్పేశాడనీ, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కి కూడా 'సైరా'పై ఇంట్రెస్ట్ తగ్గిందనే గాసిప్స్ వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ గాసిప్స్ అన్నిటికీ క్లారిఫికేషన్స్ ఇవ్వక తప్పేలా లేదు 'సైరా' యూనిట్‌కి. ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యే షెడ్యూల్లో నయనతార జాయిన్ అవనుందనే క్లారిటీ కొంతమేర వచ్చినా మళ్ళీ గాసిప్స్ యధాతథంగా ఆమెపై వస్తూనే ఉన్నాయి. ఇదొక్కటే కాకుండా, సినిమా కథ గురించీ ఎన్నో వివాదాలు పుట్టుకొస్తున్నాయి.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అసలు స్వాతంత్య్ర సమరయోధుడే కాదంటూ ఓ వ్యక్తి మీడియాకెక్కి రచ్చ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రచయితలు పరుచూరి బ్రదర్స్ ద్వారా ఓ క్లారిటీ ఇప్పిస్తే బాగుంటుందని మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సురేందర్‌రెడ్డికీ, నిర్మాత రామ్‌చరణ్‌కీ సూచించారని తెలుస్తోంది. అయితే అలాంటి గాసిప్స్ పట్ల స్పందించడం అనవసరం అని కూడా అభిమానుల్లో ఇంకో వర్గం నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా 'సైరా' అప్డేట్స్ అంటూ వస్తే, అభిమానులకి అంతకన్నా కావాల్సిందేముంటుంది?