రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. కైరా అడ్వాణీ కథానాయిక. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. శంకర్ సినిమాలన్నీ ఏదో ఓ ఇష్యూతో ముడిపడి ఉంటాయి. ఈసారి శంకర్ పొలిటికల్ థ్రిల్లర్ ని ఎంచుకున్నట్టు సమాచారం. రాజకీయాల్లో ఉన్న అవినీతిని ఎండగడుతూ శంకర్ ఈ కథని రాశాడట. ఈ సినిమా కోసం `విశ్వంభర` అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు.
విశ్వంభర అనే మాట.. తెలుగు సాహితీ ప్రియులకు సుపరిచితమే. సి.నారాయణరెడ్డి రచించిన కావ్యం `విశ్వంభర`. ఆ కావ్యానికీ ఈ కథకీ సంబంధం లేదు గానీ.. ఈ టైటిల్ కథకు యాప్ట్ గా ఉంటుందని చిత్రబృందం భావించింది. అందుకే ప్రస్తుతానికి దీన్ని ఓ వర్కింగ్ టైటిల్ గా నిర్ణయించారు. ఈనెల 9 నుంచి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ పాటతో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తారు. 2023 జనవరిలో ఈ సినిమాని విడుదల చేసే అవకాశం ఉంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సునీల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ప్రతినాయక పాత్ర కోసం చాలా మంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి.