శంకర్ సినిమాలంటేనే లేటు. మేకింగ్ విషయంలో రాజీ పడని తత్వం వల్లే ఆయన సినిమాలు ఆలస్యం అవుతుంటాయి. 'గేమ్ ఛేంజర్' దీ అదే దారి. 'ఆర్.ఆర్.ఆర్' తరవాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఇది. మధ్యలో 'ఆచార్య' వచ్చినా - దాన్ని చిరంజీవి సినిమాగానే.. పరిగణించారు ఫ్యాన్స్. కాబట్టి 'ఆచార్య' లెక్కలో లేనట్టే. 2023లో 'గేమ్ ఛేంజర్' రావాల్సింది. 2024 సంక్రాంతికి అన్నారు. రాలేదు. 2024 వేసవికీ రావడం లేదు. మరి 'గేమ్ ఛేంజర్' ఎప్పుడు..?
దాదాపు రూ.250 కోట్లతో రూపొందుతున్న ప్రాజెక్ట్ ఇది. ఇంత భారీ చిత్రాన్ని పండగ బరిలో దించితేనే సేఫ్ అని దిల్ రాజు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఈ సినిమాని దసరాకి సిద్ధం చేసే పనుల్లో ఆయన బిజీగా ఉన్నారని తెలుస్తోంది. దసరా మంచి సీజనే. వరుస సెలవలు కలిసొస్తాయి. అందుకే దసరాలో విడుదల చేస్తే ప్లస్ అవుతుందని దిల్ రాజు భావిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ కూడా బుచ్చిబాబు సినిమాకి కమిట్ అయ్యాడు. సంక్రాంతి తరవాత ఈ సినిమా ప్రారంభం కావాలి. కానీ.. కుదరడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏప్రిల్ లో బుచ్చిబాబు సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చరణ్ ఫిక్సయినట్టు తెలుస్తోంది.
ఫిబ్రవరి, మార్చి.. ఈ రెండు నెలలూ పూర్తిగా `గేమ్ ఛేంజర్`కి కేటాయించాలని చరణ్ భావిస్తున్నాడట. మార్చి నాటికి 'గేమ్ ఛేంజర్'తో తన పార్ట్ పూర్తి చేసి, ఏప్రిల్ లో బుచ్చిబాబు సినిమాకి అందుబాటులో ఉండాలనుకొంటున్నాడు. ఈ సినిమా స్పీడుగా ముగించాలన్న ఒత్తిడి శంకర్ పై కూడా ఉంది. ఆయన కూడా ఎలాగోలా ఈ సినిమాని ఫినిష్ చేయాలని చూస్తున్నారు. ఈవారంలో దిల్ రాజు - శంకర్‌ల మధ్య ఓ మీటింగ్ ఉంది. తదుపరి షెడ్యూల్స్, విడుదల తేదీ విషయంలో ఓ క్లారిటీ వచ్చే ఛాన్సుంది.