డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ స్టంట్ కోసం ఏం చేసినా చెల్లిపోతుంది. ఎందుకంటే ఆయన వర్మ కాబట్టి. అలాగే ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌పై నడుస్తోంది. ఈయన దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లేందుకు ఇంకా చాలా టైమే ఉంది. వచ్చే ఏడాది పిబ్రవరిలో కానీ ఈ సినిమా పట్టాలెక్కదు. అయితే ఈ లోగా ఈ సినిమాపై వర్మ క్రియేట్ చేస్తున్న ఇంట్రెస్ట్ అంతా ఇంతా కాదు. పబ్లిసిటీ మరీ ఇంతిలానా వర్మ! అనుకునేంతలా అన్నమాట. ఏంటనుకుంటున్నారా ఇంతకీ.. వర్మకి రోజూ ఎన్టీఆర్ కల్లోకి వస్తున్నారట. వచ్చి.. వర్మతో ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే రాయిస్తున్నారట. వినడానికి బావుంది కదా. దెయ్యం స్టోరీలాగా. వర్మకి దెయ్యం స్టోరీలంటే ఆ మధ్య చాలా మోజుగా ఉండేది. అందమైన అమ్మాయిల్ని హీరోయిన్స్‌గా పెట్టి, దెయ్యం చిత్రాల్ని తెగ తెరకెక్కించారు గతంలో. ఈ మధ్య ఆయన దృష్టి ఈ బయోపిక్స్ వైపు మళ్లింది కానీ.. ఈ బయోపిక్స్‌లో ఎన్ని బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించాయో, ఎన్ని బోల్తా కొట్టాయన్నది పక్కన పెడితే, వీటి ద్వారా వర్మ ఎదుర్కొన్న కాంట్రవర్సీలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా మన కాంట్రవర్సీల హీరోకి ఇదిగో ఎన్టీఆర్ బయోపిక్ దొరికింది. ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఎన్టీఆర్ జీవిత చరిత్ర కాదట. ఆయన దృష్టి కోణంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అట. ఇది నా యాంగిల్ మాత్రమే అంటూ, ఎన్టీఆర్ చరిత్ర మహాభారతంలాంటిది. అందులోంచి నేను ఎంచుకున్న పర్వం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. కావాలంటే ఈ బయోపిక్‌పై ఎవరెన్ని సినిమాలైనా చేసుకోవచ్చుననీ, ఆయన మాత్రం ఈ సినిమా తప్ప మళ్లీ ఈ కాన్సెప్ట్‌తో సినిమా చేయననీ స్పష్టం చేశారు. అదీ సంగతి.