టాలీవుడ్ లో ఉన్న ప్రతిభావంతమైన యువ హీరోల్లో రామ్ ఒకడు. ప్రేమకథలు, యాక్షన్ సినిమాలు.. ఎందులో అయినా సూట్ అయిపోతాడు. `ఇస్మార్ట్ శంకర్`తో రామ్ మళ్లీ యాక్షన్ మాయలో పడ్డాడు. ఆ తరవాత వచ్చిన `రెడ్` పూర్తిగా యాక్షన్ డ్రామానే. ఇప్పుడు లింగు స్వామితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా యాక్షన్ కథా చిత్రమే. ఇందులో రామ్ పోలీస్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే... యాక్షన్ డోస్ డబుల్ అవుతుంది.
అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకి గానూ... రామ్ ఏకంగా 15 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడట. ఈ సినిమా బడ్జెట్ కూడా 50 కోట్లకు పైమాటే అని టాక్. రామ్ కి ఇదే అత్యధిక పారితోషికం. ఇస్మార్ట్ శంకర్ దాదాపు 50 కోట్లు వసూలు చేసింది. దాంతో రామ్ తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడన్నటాక్ వినిపిస్తోంది. రామ్ ఇస్మార్ట్ శంకర్ 50 కోట్లు చేసింది కదా, అని ప్రతీ సినిమా అంతే వసూలు చేస్తుందనుకోవడం పొరపాటు. రామ్ `రెడ్` బాక్సాఫీసు దగ్గర మంచి టాక్ తెచ్చుకున్నా 20 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. అలాంటప్పుడు.. రామ్ కి 15 కోట్లు ఇవ్వడం రిస్కే. పైగా లింగు స్వామి ఏమాత్రం ఫామ్ లో లేడు. ఆయన్ని నమ్ముకుని 50 కోట్లతో సినిమా చేయడం.. రామ్ కి 15 కోట్లు పారితోషికం ఇవ్వడం నిజంగా.. ఆశ్చర్య పరిచే విషయాలు. మరి.. నిర్మాతలు అంత రిస్క్ ఎందుకు చేస్తున్నారో..?