దర్శక ధీరుడు రాజమౌళి సతీమణి రమా రాజమౌళి చూడ్డానికి చాలా చాలా సౌమ్యంగా కన్పిస్తారు. అయితే తెరవెనుకాల తన భర్త రాజమౌళి రూపొందించే సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తూ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారామె. సౌమ్యంగా కనిపించినంతమాత్రాన ఆమెను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాస్ట్యూమ్స్ డిజైనింగ్‌లో రమా రాజమౌళి గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అయినప్పటికీ కూడా ఆమె ఎప్పుడూ మీడియా ముందుకొచ్చి తన గురించి చెప్పుకోలేదు. రాజమౌళి తన సినిమాలకు వేరేవారి అవసరం లేకుండా, అంతా ఇంట్లోని వాళ్ళతోనే సరిపెట్టేసుకుంటాడనే పనికిమాలిన విమర్శలు రావడం సహజమే. అయితే ఈసారి అలాంటి విమర్శల్ని రమా రాజమౌళి తేలిగ్గా తీసుకోలేదు, ఘాటుగా స్పందించారు. రాజమౌళి ఎవర్నీ ఇండస్ట్రీపై బలవంతంగా రుద్దలేదనీ తాను అయినా, రాజమౌళి వదిన వల్లి అయినా సినిమా కోసం అంకిత భావంతో పనిచేస్తామని అన్నారు. పనిలో నిబద్ధత గురించి తమను ఎవరూ ప్రశ్నించలేరని చెబుతూ, ఓ సినిమా కోసం రోజులో 20 గంటలు కేటాయించగలం, అది మాకు మాత్రమే సాధ్యం అని నిక్కచ్చిగా చెప్పారు రమా రాజమౌళి. లైవ్ ప్రొడక్షన్ గురించి వల్లి చూసుకోవడం, ఆ పని పట్ల ఆమె అంకిత భావం గురించి రాజమౌళి చెప్పేటప్పుడు, ఆయన కళ్ళు చెమర్చుతాయి. భార్య గురించి మాట్లాడేటప్పుడు అయినా అంతే. తండ్రి విజయేంద్రప్రసాద్‌తో కథ రాయించుకోవడం, అన్నయ్య కీరవాణితో సంగీతం చేసుకోవడం, భార్యతో కాస్ట్యూమ్స్, వదినతో లైవ్ ప్రొడక్షన్ ఇలా పని చేయించుకోవడం, దాని ఔట్‌పుట్ బాగా రాబట్టడం రాజమౌళి ప్రత్యేకత అయితే, మహిళలైనా ధీరవనితల్లా కష్టపడుతున్నందుకు వారినీ అభినందించాల్సిందే.