ముందుగా శివగామి పాత్ర కోసం దర్శక ధీరుడు రాజమౌళి అలనాటి అందాల తార శ్రీదేవిని సంప్రదించగా, ఆమె ఒస్పుకోలేదు. ఎక్కువ రోజులు డేట్స్ ఇవ్వలేకపోవడంతోపాటుగా ఆమె అడిగిన రెమ్యునరేషన్ దక్కలేదన్న కారణంగా ఆ ఛాన్స్ వదులుకుందామె. అయితే అనూహ్యంగా రమ్యకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. ఎవరికీ తెలియని విషయమేంటంటే శివగామి పాత్రకు రమ్యకృష్ణ కూడా తొలుత ఓకే చెప్పలేదట. అన్ని ఎక్కువ రోజులు డేట్స్ ఇవ్వలేనని రమ్యకృష్ణ చెప్పగా, ముందు కథ వినాల్సిందిగా కోరారట రాజమౌళి. కథ విన్నాక రమ్యకృష్ణ ఇంకో మాట మాట్లాడలేదట. అలా శివగామి పాత్రలో రమ్యకృష్ణని మనం తెరపై చూడగలిగాం. రమ్యకృష్ణ కాకుండా ఇంకెవర్నీ ఆ పాత్రలో ఊహించలేం. 'బాహుబలి' సినిమాకి ఉన్న హైలైట్స్‌లో రమ్యకృష్ణ పోషించిన 'శివగామి' ముఖ్యమైనది. రాజమాతగా ఆమె రాజసం మరెవ్వరూ పండించలేరు. ఆమె అందం, హుందాతనం, హావభావాలు ఒక్కటేమిటి ఈ పాత్రకు రమ్యకృష్ణ తప్ప మరే నటి సూటవ్వదు అంటే అతిశయోక్తి కాదు. ప్రతీ సీన్‌లోనే ఆమె అంత అద్భుతంగా తన టాలెంట్ చూపించింది. రాజమాత అంటే రాజమాతే, సినిమా స్టార్టింగ్ నుండీ, ఎండింగ్ వరకూ ఆమె సీన్‌లో ఉన్నా లేకున్నా ఆమె అప్పియరెన్స్ ఎండింగ్ వరకూ తలపిస్తూనే ఉంది. అంతగా ప్రభావం చూపింది ఆడియన్స్‌లో శివగామి పాత్ర. పాత్ర గొప్పతనం ఒక ఎత్తు, ఆ పాత్రకి రమ్యకృష్ణ చేసిన సంపూర్ణ న్యాయం ఒక ఎత్తు వెరసి 'బాహుబలి'కి శివగామిగా రమ్యకృష్ణ పాత్ర ఎంత కీలకమైనదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమెకి కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ 'శివగామి'.