థియేటర్లకు ఓటీటీ వేదికలు ప్రత్యామ్నాయంగా మారిన రోజులివి. థియేటర్ల రీ ఓపెన్ కోసం ఎదురు చూసీ, ఎదురు చూసీ విసిగిపోయిన నిర్మాతలు ఇప్పుడు మెల్లమెల్లగా ఓటీటీ బాట పడుతున్నారు. ప్రేక్షకులకూ... ఇంటి పట్టునే ఉంటూ సినిమాలు చూసే అవకాశం దక్కుతోంది. నితిన్ కొత్త సినిమా రంగ్ దే కూడా ఓటీటీలోనే విడుదల అవుతోందని ప్రచారం సాగుతోంది. జీ 5, అమేజాన్‌ప్రైమ్ ఈ సినిమా కోసం పోటీ పడుతున్నాయి. అమేజాన్ అయితే ఈ సినిమాకు 40 కోట్లు ఆఫర్ చేసినట్టు టాక్. నిర్మాతలు కూడా అమేజాన్‌కే అమ్మడానికి ఫిక్సయినట్టు తెలుస్తోంది.
అయితే అమేజాన్ ఇక్కడో ట్రిక్ ప్లే చేయబోతోంది. అమేజాన్ అకౌంట్ ఉన్నవాళ్లంతా ఈసినిమాని ఫ్రీగా చూడడానికి వీల్లేదు. కనీస రుసం చెల్లించి ఈసినిమా చూడాలి. అంటే పే ఫర్ వ్యూ పద్ధతి అన్నమాట. ఇది వరకు రాంగోపాల్ వర్మ ఏటీటీలో విడుదల చేసిన సినిమాలన్నీ పేపర్ వ్యూ పద్ధతిలోనే. ఆయనేమో టికెట్టు రేటు 150, 200 అంటూ పెంచుకుంటూ వెళ్లాడు. కానీ అమేజాన్ కి అంతంత రేటు పెట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పటికే నెలసరి రుసుములు చెల్లించి అమేజాన్ సబ్ స్క్రైబ్ చేసుకున్న వినియోగదారుల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. అందుకే టికెట్ రేటు తక్కువగానే ఉండాలని భావిస్తోంది.
కనీసం 49 రూపాయల ధరని ఫిక్స్ చేయాలన్నది అమేజాన్ నిర్ణయం. ఈ విషయంలో ఓ క్లారిటీ రాగానే.. రంగ్ దే విడుదల తేదీ ని ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజుల్లో ఇంటిల్లిపాదీ సినిమాకు వెళ్లాలంటే కనీసం 1000 రూపాయలు ఉండాలి. అదే అమేజాన్ ప్రైమ్ తోడుంటే.. 49 రూపాయలకే కొత్త సినిమా చూడొచ్చు. ఇది గిట్టుబాటు బేరమే.