ఓ పెద్ద సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమా కథ ఇదేనంటూ కొన్ని పుకార్లు షికార్లు చేస్తూంటాయి. పెద్ద సినిమాలకు ఈ పుకార్లు చాలా కామన్. అయితే అందులో అభిమానులు ఇష్టంగా కొన్ని కథలు తయారుచేస్తే, దురభిమానులు సినిమాని బ్లేమ్ చేయాలనే ఉద్దేశ్యంతో మరికొన్ని కథలు పుట్టిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదో ట్రెండ్ అయ్యి కూర్చుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ గాసిప్స్ కూడా నిజం అవుతూ ఉంటాయి. ప్రస్తుతం 'రంగస్థం' విషయంలో ఏ గాసిప్ నిజమవుతుందో కానీ, ఆ సినిమా కథ ఇదేనంటూ చాలా గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.
చిరంజీవి హీరోగా చాలా కాలం క్రితం 'ఊరుకిచ్చిన మాట' అనే సినిమా వచ్చింది. ఆ సినిమానే ఇప్పుడు 'రంగస్థలం'గా రూపొందించబోతున్నారంటూ గాసిప్స్ ప్రముఖంగా సర్క్యులేట్ అవుతున్నాయి. 'రంగస్థలం' కథ విషయానికి వచ్చేసరికి 1985లో జరిగే ఓ పల్లెటూరి ప్రేమకథ. అరతే తెలుసు ప్రస్తుతానికి. అయితే ఈ కథని, అప్పట్లో చిరంజీవి చేసిన సినిమా కథతో పోల్చి చూపిస్తున్నారు. కానీ ఇందులో ఎంత నిజముందో విడుదలైతే కానీ తెలీదు.
చరణ్ నటించిన 'బ్రూస్‌లీ' సినిమాని చిరంజీవి 'గ్యాంగ్‌లీడర్'తో పోల్చారు విడుదలకు ముందు. కానీ 'బ్రూస్‌లీ' విడుదలయ్యాక అది నిజం కాదని తెలిసింది. అలాగే ఇప్పుడు 'రంగస్థలం' విషయంలో ఏం జరుగుతుందో చూడాలి మరి. సుకుమార్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, చాలా లాజిస్టిక్‌గా తెరకెక్కిస్తున్నాడు. చరణ్, సమంతల స్టిల్స్ లీకేజీ విషయమై గందరగోళం జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది.