రావు గోపాలరావు వారసుడిగా అడుగుపెట్టిన రావు రమేష్.. అనతి కాలంలోనే తనదంటూ ఓ మార్క్ సృష్టించుకున్నాడు. రావు గోపాలరావుతో పోల్చలేం గానీ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రావు రమేష్ ది ఓ ప్రత్యేకమైన శైలి. కొన్ని సినిమాలు రావు రమేష్ కి పేరు తీసుకొస్తే.. కొన్ని సినిమాలకు రావు రమేష్.. పేరు తీసుకొచ్చాడు. అది వాస్తవం. ఉదాహరణకు.. `ప్రతిరోజూ పండగే` లాంటి సినిమాలు కేవలం రావు రమేష్ వల్లే నిలబడ్డాయి. ఆడాయి. తన సత్తా ఏమిటో టాలీవుడ్ కి బాగా తెలుసు. ఒకప్పుడు ప్రకాష్ రాజ్ వెంట పడిన టాలీవుడ్.. ఇప్పుడు రావు రమేష్ జపం చేస్తోందంటే దానికి కారణం అదే. టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న క్యారెక్టర్ నటుడు కూడా తనే. ఒక్క రోజుకి తన పారితోషికం 4 లక్షల పైమాటే అని టాక్. పెద్ద సినిమాలైతే బల్క్ గా కాల్షీట్లు ఇస్తాడు. దాని పారితోషికం కూడా అదే రేంజ్ లో ఉంటుంది. తాజాగా... రావు రమేష్ ఓ సినిమాకి అందుకుంటున్న పారితోషికం గురించి టాలీవుడ్ లో హాట్ టాపిక్ నడుస్తోంది.
`నాయట్టు` అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తోంది గీతా ఆర్ట్స్. ఇందులో రావు రమేష్ ది కీలకమైన పాత్ర. అందుకుగానూ ఏకంగా `1.5 కోట్లు పారితోషికంగా ముట్టజెబుతున్నార్ట. నిజానికి ఈ సినిమాని చాలా తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయాలని గీతా ఆర్ట్స్ భావించింది. ఆర్టిస్టులందరికీ తక్కువ పారితోషికాలే ఇస్తోంది. కానీ రావు రమేష్‌కి మాత్రం రికార్డు స్థాయిలో పారితోషికం ముట్టజెబుతోంది. దానికి కారణం.. రావు రమేష్ వల్ల ఆ పాత్రకు మరింత డెప్త్ వస్తోందని నమ్మడమే. అంతేనా? `ఈ పాత్ర రావు రమేష్ చేస్తానంటేనే ఈ సినిమాని రీమేక్ చేద్దాం` అని అల్లు అరవింద్ చెప్పార్ట. ముందు రావు రమేష్ కాల్షీట్లు బుక్ చేశాకే.. ఆ తరవాత మిగిలిన పనులు మొదలెట్టారట. రావు రమేషా.. మజాకానా?