సాధారణంగా ఓ ఫ్లాప్ రాగానే, హీరోలు తగ్గుతారు. పారితోషికంలో రిబేట్లు, డిస్కౌంట్లూ ఇస్తారు. కొంతమందికి ఆ పారితోషికంతోనూ అవసరం ఉండదు. ఓ హిట్టు చేతికి వస్తేచాలు అనుకుంటారు. కానీ రవితేజ మాత్రం వేరే టైపు. వరుసగా తన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా, తాను మాత్రం పారితోషికం తగ్గించుకోడు. సరికదా.. పెంచుకుంటూ పోతుంటాడు. రెండేళ్ల క్రితం వరకూ రవితేజ పారితోషికం 6 నుంచి 7 కోట్ల వరకూ మాత్రమే. అయితే.. వరుసగా ఫ్లాపులొచ్చాయి. కానీ.. పారితోషికం తగ్గించలేదు.
`అమర్ అక్బర్ ఆంటోనీ`కి అయితే 10 కోట్లు తీసుకున్నాడు. క్రాక్, ఖిలాడీ సినిమాలకూ అంతే. ఇప్పుడు అయితే 12 కోట్లు అడుగుతున్నాడట. `చేతిలో హిట్టు లేదు కదా.. ఇంత పారితోషికం ఎందుకు` అని ఎవరైనా అడిగితే.. `నచ్చితే చేయండి, లేదంటే లేదు` అని తెగేసి చెబుతున్నాడట. అంతే కాదు.. `నా పారితోషికం నేనే తగ్గించుకుంటే, నేను ఫ్లాపుల్లో ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా` అని లాజిక్ తీస్తున్నాడట. రవితేజ అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడే నిర్మాతలే.. ఆయనతో సినిమాలు చేస్తున్నారు. `క్రాక్` గనుక హిట్టయితే రవితేజ 15 కోట్లు అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.