హీరోలు హిట్టు కొడితే సక్సెస్ పార్టీలు ఇవ్వడం మామూలే. ఇండస్ట్రీలో హిట్టు రావడం గగనమైపోయిన తరుణంలో.. హిట్ కొడితే.. పార్టీలు చేసుకోవడం, సెలబ్రేషన్స్ లో మునిగిపోవడం.. మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే.. ఓ హీరో హిట్టు కొడితే, మరో హీరో పిలిచి మరీ పార్టీ ఇవ్వడం చాలా అరుదైన విషయం. అలా... ఓ హీరో హిట్ ని సెటబ్రేట్ చేసుకొన్న అరుదైన హీరోగా నిలిచారు... చిరంజీవి.
రవితేజ అంటే చిరంజీవికీ, చిరంజీవి అంటే రవితేజకు ఉన్న అభిమానాన్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరుని స్ఫూర్తిగా తీసుకొని రవితేజ చిత్రసీమకు వచ్చాడు. ఇప్పుడు తాను కూడా చాలామందికి స్ఫూర్తి ఇస్తున్నాడు. వీరిద్దరూ కలిసి ఇప్పుడు `వాల్తేరు వీరయ్య`లో నటించారు. ఈనెల 13న చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిరుకి రవితేజ అంటే ఎంత ఇష్టమో కోన వెంకట్ ఓ సందర్భంలో చెప్పారు. రవితేజ సినిమా హిట్టయిన ప్రతీసారీ.. చిరు ఇంట్లో పార్టీ ఇచ్చేవార్ట. ఈ పార్టీకి పూరి, కోన వెంకట్లు కూడా హాజరయ్యేవార్ట. ``రవితేజ హిట్టు కొట్టాడు... కదా నేను పార్టీ ఇస్తా.. మా ఇంట్లో సరదాగా కూర్చుందాం... అని చిరంజీవి స్వయంగా పిలిచేవారు. అలాంటి పార్టీలకు నేను చాలా సార్లు హాజరయ్యా. తనకు కావల్సినవాళ్లు హిట్టు కొడితే.. తానే హిట్టు కొట్టినంత ఆనందిస్తారు చిరంజీవి. అది ఆయనలోని గొప్ప లక్షణం`` అని కోన వెంకట్ తెలిపారు. ఇటీవలే జనవరి 1 సందర్భంగా చిరు ఇంట్లో మెగా పార్టీ ఈవెంట్ జరిగింది. ఈ పార్టీకి రవితేజ కూడా హాజరైన సంగతి తెలిసిందే.