కుటుంబ సభ్యుడిని కోల్పోయి మానసికంగా కుంగిపోయిన తమ కుటుంబంపై లేనిపోని దుష్ప్రచారం చేసి, ఇంకా తమను వేధించడం తగదని సినీ నటుడు రవితేజ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. రవితేజ సోదరుడు భరత్ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే భరత్ పార్తీవ దేహానికి కనీసం నివాళులు కూడా అర్పించకపోవడం పట్ల రవితేజ కుటుంబ సభ్యులపై విమర్శలు వచ్చాయి. తల్లి, తండ్రి, ఇద్దరు సోదరులు భరత్‌కి ఉన్నప్పటికీ, ఒక్క సోదరుడు రఘు మాత్రమే అంత్య క్రియలకు హాజరయ్యాడు. అతనికే చివరి చూపు దక్కింది. దాంతో సహజంగానే విమర్శలు వచ్చాయి రవితేజపైన. ఈ విమర్శలపై రవితేజ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చాడు. తన తల్లి, తండ్రి అనారోగ్యం కారణంగా ఇబ్బందికర పరిస్థితులలో ఉండటంతోనే అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారనీ, కొడుకుగా తల్లిదండ్రుల బాధ్యత ఆ సమయంలో పూర్తిగా తన మీదనే ఉండడం వల్ల తాను కూడా అంత్యక్రియలకు వెళ్ళలేకపోయినట్లు రవితేజ చెప్పాడు. తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని రవితేజ విజ్ఞప్తి చేశాడు. అయితే ఇటువంటి సందర్భాల్లో 'ఎక్స్‌క్యూజెస్' అనేవి కొంచెం ఇబ్బందికరంగానే మారతాయి. అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయినా, రవితేజ చివరి చూపుకు నోచుకుని ఉంటే బాగుండేది.