టాలీవుడ్‌లో మరో సంచలనానికి, వివాదానికీ కేంద్ర బిందువు అయ్యాడు రాంగోపాల్ వర్మ. 'పవర్ స్టార్' టైటిల్‌తో. ఈమధ్య వర్మ ఓటీటీ కోసం సినిమాలు తీసి, జనాల మీదకు కనికరం లేకుండా వదిలేస్తున్నాడు. అయితే ఆ సినిమాలకు రాని బజ్ 'పవర్ స్టార్'కి వచ్చేసింది. దానికి కారణం.. ఆ టైటిల్‌కి ఉన్న క్రేజ్. ఆ టైటిల్ వెనుక ఉన్న వ్యక్తి.
టైటిల్ లోగోలో... టీ గ్లాసు చూపించి - పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ని కెలికేశాడు వర్మ. దానికి తోడు ఫస్ట్ లుక్‌లు, పోస్టర్లు చూసి.. పవన్ ఫ్యాన్స్ మరింత గా ఈ సినిమా గురించి ఆలోచించడం మొదలెట్టారు. పవన్ కల్యాణ్ కథ కాదంటూనే, పవన్‌కి సంబంధించిన విషయాల్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ.. పవన్‌ని పదే పదే గుర్తు చేస్తూ.. తన ఉద్దేశ్యాన్ని చెప్పకనే చెబుతున్నాడు. పవన్ కథ కాదన్నప్పుడు ఆ గ్లాసేంటి? అని పవన్ అభిమానులు అడుగుతారని తెలుసు. దానికి కూడా ఓ అందమైన కథని డిజైన్ చేసుకున్నాడు వర్మ.
తన సినిమాలో హీరో పదే పదే ఆ గ్లాసులో టీ తాగుతుంటాడని, అందుకే ఆ గ్లాసుని టైటిల్ లోగోలో పెట్టానని వివరణ ఇచ్చాడు. శివ సినిమాలో కథానాయకుడు చైను వాడతాడు. కాబట్టి ఆ టైటిల్ లో చైను చూపించా, ఇప్పుడు గ్లాసు చూపిస్తున్నా - అంటూ కవరింగ్ చేసుకుంటున్నాడు. వర్మ ఎన్ని చెప్పినా ఇది పవన్ కల్యాణ్ కథే అని అందరికీ తెలుసు. కానీ వర్మ మాత్రం ప్రపంచానికి తెలిసిన నిజాన్ని... ముసుగులు వేస్తూ, కవర్ చేస్తూ.. లోలోపల నవ్వుకుంటున్నాడు. వర్మ ఎంతైనా మేధావి. తనకు కావల్సిన ప్రచారం ఈపాటికే వచ్చేసింది. ఆ రకంగా తన ట్రిక్కు ఫలించినట్టే.