వర్మగారి స్ట్రాటజీ ఎవ్వరికీ అర్ధం కాదు. అందుకే ఆయన పబ్లిసిటీ కా బాస్ అనిపించుకున్నారు. పబ్లిసిటీ కోసం రామ్ గోపాల్ వర్మ ఏమైనా చేస్తారు. రేపు అనగా దీపావళి సందర్భంగా అక్టోబర్ 27న ఆయన తెరకెక్కిస్తున్న 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' ట్రైలర్ విడుదల కానుంది. అంతకు ముందే వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా రెండు ఫోటోలు విడుదల చేశాడు. ఆ రెండు ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోస్‌లో పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్‌లో కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ లుక్స్‌తో ఉన్న ఓ వ్యక్తి చుట్టూ అందమైన అమ్మాయిలున్నారు. ఓ పొలిటికల్ లీడర్‌ని ఇలా చూపించడం ఎంతవరకూ సబబు.? మరో ఫోటోలో నారా లోకేష్ పాత్రలో ఉన్న వ్యక్తితో డిస్కస్ చేస్తున్నట్లు పవన్ కనిపిస్తున్నాడు.
గతంలో పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పని చేసిన మాట వాస్తవమే. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. ఈ తరుణంలో సినిమా టైటిల్‌కి సంబంధం లేకుండా, పవన్ కళ్యాణ్‌ని వర్మ ఎందుకు వాడుకుంటున్నట్లు.? కేవలం పబ్లిసిటీ కోసమేనా.? ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు వర్మని దుమ్మెత్తి పోస్తున్నారు. 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' అనే టైటిల్‌కి తగ్గట్టు, చంద్రబాబు ప్రభుత్వానికీ, జగన్ ప్రభుత్వానికీ సంబంధించి కీలక అంశాల ప్రస్థావన, కీలక వ్యక్తుల ప్రస్థావన మాత్రమే వర్మ తన సినిమాలో చూపించాల్సి ఉంటుంది. అందులో పవన్ కళ్యాణ్‌కి ఎలాంటి సంబంధం ఉండదు.. అంటూ నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. అయినా ఇది వర్మ స్ట్రాటజీ. ఎలాగైనా ఉండొచ్చు అదంతే.