మార్చి.. టాలీవుడ్ కి అత్యంత కీలకంగా మారిపోయింది. 11న `రాధే శ్యామ్` వస్తోంది. 25న `ఆర్.ఆర్.ఆర్` దిగిపోతుంది. రెండూ పాన్ ఇండియా సినిమాలే. రెండింటి వ్యయం.. దాదాపుగా రూ.800 కోట్లు. రాధే శ్యామ్ కి రూ.300 కోట్లు, ఆర్.ఆర్.ఆర్‌కి రూ.500 కోట్లు బడ్జెట్ అయ్యిందని అంచనా. ఇవి రెండూ ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమాలు. కానీ కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు రెండు వారాల వ్యవధిలో రెండూ వచ్చేస్తున్నాయి.
ఆర్.ఆర్.ఆర్ రూ.400 కోట్లలోపు ముగించాలని అనుకున్నారు. కానీ విడుదల ఆలస్యం అయ్యేకొద్దీ వడ్డీ పెరుగుతూ వెళ్లింది. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ రూ.500 కోట్లకు చేరింది. ఇప్పటికి రూ.225 కోట్లు నాన్ థియేటరికల్ రైట్స్ రూపంలో వచ్చాయి. అంటే థియేటర్ల నుంచి 275 కోట్లు రావాలి. ఇది నెట్ మాత్రమే. అంటే గ్రాస్ రూపంలో చూడాలంటే కనీసం రూ.400 కోట్లు రాబట్టాలి. ఈ బడ్జెట్ దర్శకుడి పారితోషికం లెక్కలో వేసుకోకుండా చెప్పిందట. రాజమౌళికి కనీసం 50 కోట్ల పారితోషికం అనుకున్నా, రూ.450 కోట్లు థియేటర్ నుంచి రాబట్టాలి. ఎటు చూసినా 800 కోట్లు వస్తే తప్ప, `ఆర్.ఆర్.ఆర్` నిర్మాత లాభాలు చూసినట్టు కాదు. ఇది నిజంగా పెద్ద టాస్కే.