మార్చి 25... టాలీవుడ్ కి బిగ్ డే. ఈ రోజు ఆర్.ఆర్.ఆర్ విడుదల అవుతోంది. ఈ సినిమా కోసం ఎన్నాళ్ల నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా ఇది రాజమౌళి సినిమా. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి చేసిన సినిమా. కాబట్టి.. టాక్ ఎలా ఉన్నా, తొలి మూడు రోజులు థియేటర్లు మోత మోగిపోవడం ఖాయం. అయితే ఈ సినిమా టికెట్ రేటు సామాన్యుడికి అందుబాటులో ఉంటుందా, లేదా? అనేదే పెద్ద ప్రశ్న.
25వ తేదీ అర్థరాత్రి నుంచే బెనిఫిట్ షోల హడావుడి మొదలైపోతుంది. బెనిఫిట్ షోకి టికెట్ దాదాపుగా రూ.2 వేల వరకూ ఉంటుందని టాక్. ఇది చాలా పెద్ద మొత్తమే. కానీ.. ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్‌కి టికెట్ దొరకడమే ఎక్కువ అనుకుంటున్నారు. సో.. 2 వేలు అనేది వాళ్లకు రీజన్ బుల్ అనుకోవచ్చు. బెనిఫిట్ షో పక్కన పెడితే.. తొలి పది రోజుల్లో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఈ సినిమాకి ఉంది. ఎక్కడ చూసినా 200 తక్కువ టికెట్ రేటు లేదు. హైదరాబాద్ లో మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలంటే మూడొందలు పైమాటే. బీ, సీ సెంటర్లలోనూ టికెట్ రేటు మోత మోగిపోతోంది. ఈ దశలో.. కుటుంబంతో కలిసి సినిమాకి వెళ్లాలంటే కనీసం 2 వేలు అర్పించుకోవాలి.
ఈమధ్య సామాన్య జనం థియేటర్లకు వెళ్లడం బాగా తగ్గించేశారు. కారణం.. ఓటీటీల రూపంలో వాళ్లకు వినోదం అందుబాటులో ఉండడమే. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత హిట్ సినిమా అయినా... విడుదలైన 20 రోజుల్లో ఓటీటీల్లో వచ్చేస్తుందన్న ధీమా ఉంది. అప్పటి వరకూ సినిమా కోసం ఎదురు చూడడం వాళ్లు అలవాటు చేసుకున్నారు. సంప్రదాయ ప్రేక్షకుల్లో చాలామంది ఇప్పుడు ఓటీటీలకే మొగ్గు చూపిస్తున్నారు. సినిమా సూపర్ హిట్టయిపోయి, ఇలాంటి సినిమాని ఓటీటీలోకి వచ్చేంత వరకూ ఆగకూడదు.. అని ఫిక్సయితేనే థియేటర్లకు వెళ్తున్నారు. పెరిగిన రేట్లు, భయపెడుతున్న బెనిఫిట్ షో టికెట్లు.. ఇవన్నీ సామాన్యుడికి థియేటర్లకు దూరం చేస్తున్నాయి. కానీ కొన్ని సినిమాలు వీటన్నింటికీ అతీతం. వాటికి ఈ లెక్కలతో పనిలేదు. ఆర్.ఆర్.ఆర్ కూడా అలాంటి సినిమానే అన్నది విశ్లేషకుల మాట. ఈ సినిమాని జనాలు పోటెత్తుతారని అనుకుంటున్నారు. అదే జరిగితే... టికెట్ ధరలు ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపవని, ఓటీటీల హవా తక్కువే అని నిరూపణ అవుతుంది. లేదంటే.. సమీకరణాలు మారాయి అనేది అర్థం చేసుకోవాలి. మరి... ఏం జరుగుతుందో తేలాంలంటే ఆర్.ఆర్.ఆర్ రావాల్సిందే.