హీరో సచిన్ జోషి గుర్తున్నాడు కదా..? `మౌనమేలనోయి`, `నిను చూడక నేనుండలేను`, `ఒరేయ్ పండు` లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సెలబ్రెటీ క్రికెట్ లీగ్ లోనూ కనిపించేవాడు. మొన్నామధ్య బండ్ల గణేష్ వ్యవహారంలో... ఈ పేరు బాగా వినిపించింది. ఇప్పుడు ఓ కేసులో అరెస్ట్ అయ్యాడు. గుట్కా అక్రమ రవాణా కేసులో హైదరాబాద్ పోలీసులు ముంబైలో ఆరెస్ట్ చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పోలీసులు పట్టుకున్నారు. భారీగా గుట్కా బాక్సులు దొరకడంతో సెలబ్రిటీలపై నిఘా పెంచారు. అయితే ఈ కేసులో దొరికిన నిందితులను విచారించగా, పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సచిన్ జోషి పేరు బయటకు రావడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు.
సచిన్‌పై ఐపీసీ 273, 336 సెక్షన్ల ప్రకారం నిషేధిత మత్తు పదార్థాల కేసు నమోదైంది. అమ్మకాలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారారనే ఆరోపణలుపై కేసు నమోదు చేశారు. భారీ సంఖ్యలో గుట్కా బాక్సులు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. పెద్ద మొత్తంలో గుట్కా బాక్సులు స్వాధీనం చేసుకున్నారు.