'సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్' అనే పేరుతో సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా ట్రైలర్ కూడా వచ్చేసింది. త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ మధ్యకాలంలో కొందరు క్రికెటర్ల జీవిత చరిత్రలు సినిమాలుగా వచ్చాయి. వాటిల్లో 'అజార్' సినిమా ఒకటైతే, 'ఎంఎస్ ధోనీ' ఇంకోటి. ఇద్దరూ భారత క్రికెట్ జట్టుకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు కెప్టెన్లుగా. అజార్ జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కడానికి చాలా కాలం పట్టింది. అయితే ధోనీ సినిమాని చాలా వేగంగా రూపొందించేశారు. వీటిల్లో అజార్ అంతగా ఆకట్టుకోకపోగా, ధోనీ సినిమా మాత్రం అలరించింది. ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ ఫార్మాట్‌లో రూపొందినవే. సచిన్ సినిమా మాత్రం అలాంటిది కాదట. డాక్యుమెంటరీ తరహాలో సినిమా ఉంటుందని సమాచారమ్. అయితే ఈ సినిమాకి మెయిన్ హైలైట్ సచిన్ టెండూల్కర్ వాయిస్ ఓవర్. సచిన్ అంటే క్రికెట్ దేవుడు. అజారుద్దీన్, ధోనీల సంగతి వేరు. వారిద్దరూ క్రికెట్‌లో ఎంతో పాపులర్ అయినా, అంతకుమించిన అభిమానం సచిన్ మీద క్రికెట్ అభిమానులు చూపిస్తుంటారు. సచిన్ రిటైర్‌మెంట్ తర్వాత కూడా మైదానాల్లో సచిన్ ప్లకార్డులు కనిపిస్తాయి. కాబట్టి డాక్యుమెంటరీ అయినా 'సచిన్' సినిమా సక్సెస్ అవుతుందని ఆశించవచ్చు. ఇంకో వైపున అజార్ తన సినిమాని ప్రమోట్ చేసుకున్నట్టుగా, ధోనీ తన సినిమాని ప్రమోట్ చేసుకున్నట్టుగా సచిన్ తన సినిమాని ప్రమోట్ చేసుకుంటాడో లేదో చూడాలిక.