మలయాళంలో 'ప్రేమమ్' చిత్రంతో పాపులర్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో సత్తా చాటుతోంది. ఎంట్రీ సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఒకెత్తయితే, ఓ రేంజ్లో ప్రశంసలు అందిపుచ్చుకుంది. అస్సలు తెలుగే రాని ఈ అమ్మాయి, తొలి సినిమాకే తెలుగు నేర్చుకుని, తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. మరి ప్రశంసలు అందుకోకుండా ఎలా ఉంటుంది చెప్పండి.
తొలి సినిమాకే అచ్చమైన తెలుగమ్మాయిలా అదీ తెలంగాణా యాసలో మాట్లాడి మెప్పించింది. మామూలుగా తెలుగు మాట్లాడడం వేరు. ఓ ప్రాంతపు యాసలో మాట్లాడడం అంటే ఎంత కష్టం. ఆ కష్టాన్ని ఎంతో ఇష్టంగా మార్చుకుని తెలంగాణా ప్రజల ఆదరాభిమానాలు పొందింది. అంతేకాదు సాయి పల్లవి గొంతులో నాని తెలంగాణా యాస ఓ ట్రెండీ అయిపోయింది. హైలీ ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు కూడా తెలంగాణా యాసలో మాట్లాడడాన్ని ఓ ట్రెండీగా మార్చేసుకున్నారు. అంతగా సాయి పల్లవి 'ఫిదా' సినిమాతో తన మార్కు యూత్‌కి కనెక్ట్ చేసేసింది.
తాజాగా నానితో 'ఎంసీఏ' చిత్రంలో నటిస్తోందీ బ్యూటీ. ఈ సినిమాలో కూడా అమ్మడు తెలంగాణా అమ్మాయేనట. తెలంగాణా యాసలోనే మాట్లాడుతోంది. దాంతో ఇక సాయిపల్లవి మెల్లమెల్లగా తెలంగాణా అమ్మాయే అని ముద్ర వేయించేసుకుంది. అలా అని ఆంధ్రా వాళ్లకీ తక్కువ చేయడం లేదు. అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది ఈ బ్యూటీ. అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమాలో నటించేందుకు ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పడం లేదు. ఏరి కోరి ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటోంది. 'ఎంసీఏ' సినిమాలో నేచురల్ హీరో నానితో పోటీ పడి నటించేసిందట.
ఇప్పటికే ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం స్పష్టమవుతోంది. ఇక సినిమా విడుదలైతే తెలుస్తుంది. ఈ ఇద్దరి పోటా పోటీ టాలెంట్ ఎలా ఉందో! దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిశంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.