చిరంజీవి కథానాయకుడిగా నటించిన `ఆచార్య` డిజాస్టర్‌గా మిగిలిపోయింది. కనీసం 70 శాతం నష్టాలొచ్చాయి. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారు. ముఖ్యంగా భారీ వ్యయ ప్రయాసలతో ధర్మస్థలి సెట్ ని భారీగా తీర్చిదిద్దారు. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకూ ఇంత పెద్ద సెట్ చూడలేదని చిత్రబృందం సగర్వంగా ప్రకటించింది. సినిమా ఫ్లాప్ అవ్వడంతో.. ఆ సెట్ గురించి ఎవ్వరూ మాట్లాడుకోలేదు. అయితే ఇప్పుడు ఈ సెట్ మరోసారి వార్తల్లో నిలిచింది.
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా బాలీవుడ్ లో రూపొందుతున్న చిత్రం `కభీ ఈద్.. కభీ దివాలీ`. ఇటీవల ముంబైలో షూటింగ్ మొదలైంది. తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు కానుంది. ఈ షూటింగ్.. ధర్మస్థలిలో సెట్లో జరగబోతోంట. ఆ సెట్ లో చిన్న చిన్న మార్పులు చేసి.. కభీ ఈద్.. కభీ దివాలీ సినిమా షూటింగ్ కి అనుకూలంగా మార్చుకుంటున్నారు. దాదాపు నెల రోజుల పాటు ఇదే సెట్లో షూటింగ్ జరగబోతోంది. వెంకటేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక.