బాలీవుడ్ స్టార్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురయ్యారు. మహారాష్ట్రలోని పన్వేల్ లో సల్మాన్ కి ఓ ఫామ్ హౌస్ ఉంది. వారాంతంలో అక్కడ గడపడం, వ్యవసాయం చేయడం సల్మాన్ ఖాన్ కి చాలా ఇష్టం. అందులో భాగంగానే శనివారం తన ఫామ్ హౌస్‌కి వెళ్లారు. అయితే రాత్రి... ఓ పాము ఆయన్ని కాటేసింది. వెంటనే... సల్మాన్ సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అదృష్టవశాత్తూ సల్మాన్ ని కాటేసిన పాము విషపూరితం కాదని, సల్మాన్ కి ప్రమాదం ఏమీ కాలేదని వైద్యులు తెలపడంతో సల్మాన్ ఊపిరి పీల్చుకున్నాడు. సల్మాన్ ఫామ్ హోస్‌లో కొన్ని విష సర్పాలు కూడా ఉన్నాయని, అవి కాటేస్తే ఏమయ్యేదో అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఫామ్ హౌస్ అంతా జల్లెడ పట్టి, విష పురుగుల్ని, పాముల్ని పట్టేసి, దగ్గర్లోని అడవిలో వదిలేయాలని సల్మాన్ తన సిబ్బందికి చెప్పార్ట. మొత్తానికి సల్మాన్ కి ఓ పెను ప్రమాదమే తప్పింది.