టాలీవుడ్‌లోనే కాదు, దక్షిణాదినే అగ్ర తారగా కొనసాగుతోంది సమంత. లేడీ ఓరియెంట్ కథలకు ఇప్పుడు తానే కేరాఫ్ అడ్రస్స్. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయిక కూడా తనే. ఇప్పుడు కొత్తగా వెబ్ సిరీస్‌లలోనూ అడుగుపెట్టింది. త్వరలోనే నిర్మాతగానూ మారబోతోందని టాక్. ఈరోజు సమంత పుట్టిన రోజు. ఈ సందర్భంగా సమంత టాప్ 5 చిత్రాలపై ఓ లుక్కేస్తే...
1.ఏం మాయ చేసావె...
సమంత కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా ఏం మాయ చేసావే. గౌతమ్ మీనన్ సినిమాల్లో కథానాయికల పాత్రలు బాగుంటాయి. అయితే జెస్సీ మాత్రం వాటికి తలమానికంగా నిలిచింది. జెస్సీగా సమంత నటన, తన ముద్దు ముద్దు మాటలు, చిలిపి ఎక్స్‌ప్రెషన్స్.. ఇవన్నీ ప్రేక్షకుల్ని కట్టి పడేశాయి. సమంత కెరీర్‌లోనే ఈ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఈ సినిమాతో పరిచయమైన నాగచైతన్యని తాను ప్రేమించి, పెళ్లి చేసుకుంది. నటిగా.. తొలి అవార్డుని కూడా ఈసినిమానే తెచ్చి పెట్టింది.
2. బృందావనం
కమర్షియల్ సినిమాలకు సమంత సరితూగుతుందన్న విషయాన్ని బృందావనం నిరూపించింది. ఈ సినిమాలో కథానాయిక పాత్రని కాజల్‌తో పంచుకుంది. అయినా సరే - తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకుంది. ఈ సినిమాతో అగ్ర హీరోల దృష్టి సమంతపై పడింది. అటుపై వరుసగా.. టాప్ హీరోలతోనే సినిమాలు చేసింది 3. రంగస్థలం రామలక్ష్మి పాత్ర సమంత కెరీర్‌లో మరో గొప్ప టర్నింగ్ పాయింట్. డీ గ్లామర్ రోల్ లోనూ సమంతని చూడగలం అని ఈ సినిమా నిరూపించింది. ఎంత చక్కగున్నావే... పాటలో సమంత ఎక్స్‌ప్రెషన్స్ ఆల్ టైమ్ సూపర్ హిట్. రంగస్థలం తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమాతో సరికొత్తగా అభిమానుల్ని సంపాదించుకోగలిగింది.
4. మజిలీ
పెళ్లయ్యాక నాగచైతన్యతో కలసి నటించిన సినిమా ఇది. కాబట్టి.. ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టింది సమంత. తన పాత్ర కేవలం ద్వితీయార్థానికి పరిమితం. అయితేనేం.. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని నడిపించింది. ఇది కూడా డీ గ్లామర్ పాత్రే. ఎమోషన్స్ పండించడంలో తనకు తిరుగు లేదని ఈ సినిమాతో నిరూపించుకుంది.
5. ఓ బేబీ
సమంతలోని పరిపూర్ణ నటిని ఆవిష్కరించిన సినిమా ఇది. హాస్యం, ఎమోషన్స్.. ఇలా అన్ని కోణాలూ సృశించింది. డభై ఏళ్ల బామ్మలా కొన్ని సన్నివేశాల్లో కనిపించిన తీరు.. విమర్శకుల్ని సైతం మెప్పించింది. బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. కమర్షియల్‌గా నిర్మాతలకు లాభాల్ని తెచ్చిపెట్టింది. అలా.. ఓ బేబీ తన కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.