అర్జున్ రెడ్డి' చిత్రంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ సందీప్ వంగ. ఈ సినిమాని హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ బ్లాక్ బస్టర్ అందుకుని ఏకంగా బాలీవుడ్ లోనే స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మరో వైవిద్యమైన సినిమా కోసం రెడీ అవుతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దీంతో హిందీ నిర్మాతలు సందీప్ సినిమాలకు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ముందుకొస్తున్నారట.
'కబీర్ సింగ్' చిత్ర నిర్మాత టీ-సిరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతాని కలిసి సందీప్ తర్వాతి సినిమాను కూడా భారీ స్థాయిలో నిర్మించడానికి ముందుకొచ్చారు. వీరితోపాటే సందీప్ సోదరుడు, 'అర్జున్ రెడ్డి' నిర్మాత ప్రణయ్ వంగ కూడా చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు.
ఇక సందీప్ తరువాత సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే. క్రైమ్ డ్రామాగా ఉండనుంది. మొత్తానికి సందీప్ వంగ సినిమాలు భిన్నంగా ఉంటాయని.. అందుకే ఆయనతో ఇంకొన్ని సినిమాలు చేయడానికి సిద్దమవుతున్నామని నిర్మాత టీ-సిరీస్ భూషణ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సక్సెస్ వస్తే కొందరు పొగుడుతారు. అదే ప్లాప్ వస్తే అందరూ తిడతారు. ప్రస్తుతం ఫుల్ సక్సెస్ లో సందీప్ వంగని బాలీవుడ్ అక్కున చేర్చుకుంటుంది. మరి ఈ డైరెక్టర్ ఈ సక్సెస్ ను ఎంతకాలం కొనసాగిస్తాడో చూడాలి.