బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది కేవలం ఒక్క వారమే అయినా సరే సంజన కి వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. అక్కడ ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించిందో ఇప్పుడు బయటకి వచ్చాక కూడా దాదాపు అదే స్థాయిలో ఇంటర్వ్యూలు ఇస్తూ హల్చల్ చేస్తున్నది.
అయితే తానొక సామన్యురాలిని కాబట్టే తనకి బిగ్ బాస్ హౌస్ లో అన్యాయం జరిగింది అని తాజాగా హౌస్ లోకి ప్రవేశించిన నందిని రాయి కోసమే తనని ఎలిమినేషన్ చేశారు అని ఆరోపిస్తున్నది. బిగ్ బాస్ ఇంటిలోకి ప్రవేశించిన గంట నుండే తనని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారని ఆ తరువాత క్రమంలో అది మరికాస్త ఎక్కువైంది అని చెపుతున్నది.
ఆమె చేసే మరో ఆరోపణ ఏంటంటే- తనకన్నా నూతన్ నాయుడు కే బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ ఓట్లు వచ్చాయి అని అలాంటప్పుడు తనని ఎందుకు తీసేస్తారు అంటూ కొత్త లాజిక్ చెపుతున్నది. అయితే బిగ్ బాస్ లో ఎలిమినేషన్ అనేది ఈ షో చూస్తున్న ప్రేక్షకుల చేతిలో ఉంటుంది తప్ప ఇది కావాలని చేసేది మాత్రం కాదు అని బిగ్ బాస్ వర్గాలు అంటున్నాయి.
ఏదేమైనా.. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన మొదటి వ్యక్తే ఇలా తనకి అన్యాయం జరిగింది అని అంటుంటే రాబోయే వారు ఇంకేమంటారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మొత్తానికి సంజన మాత్రం బిగ్ బాస్ పాపులారిటీని చాలా తెలివిగా వాడుకుంటున్నది అని చెప్పొచ్చు.