సంక్రాంతి తెలుగు సినిమాకి అసలు సిసలు పండగ. కానీ, వచ్చే సంక్రాంతి ఏమవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. అంతా కరోనా తెచ్చిన కష్టమే. కరోనా నుంచి ఇంకా మనం పూర్తిగా కోలుకోలేదు. ఏ క్షణాన కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వస్తుందో తెలియక గిలగిల్లాడాల్సి వస్తోంది. నవంబర్ రెండో వారం నుంచి జనవరి చివరి వరకు కరోనా సెకెండ్ వేవ్ తీవ్రంగా వుంటుందని అంచనా వేస్తున్నారు.
రానున్న రెండు మూడు నెలల్లో ఏకంగా 80 నుంచి 90 లక్షల కొత్త కేసులు దేశంలో నమోదవ్వొచ్చంటూ పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్న దరిమిలా, తెలుగు సినీ పెద్దలు.. సంక్రాంతి రిలీజుల పట్ల ఆందోళన చెందుతున్నారట. ఇప్పటికే కొన్ని సినిమాలు ‘సంక్రాంతికి సినిమా హాళ్లలో కలుద్దాం..’ అంటూ సంక్రాంతి స్లాట్స్ రిజర్వ్ చేసేసుకుంటున్నాయి. సరిగ్గా ఈ టైమ్ లోనే కరోనా సెకెండ్ వేవ్ భయాలు బయటకొచ్చాయి. నిజానికి ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్ళు తెరచుకోలేదు. ఇంతలోనే ఈ భయాలు మొదలవడమంటే అది సినీ పరిశ్రమకు పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలి.
అయితే, భయపడాల్సిందేమీ లేదనీ, ఇంకోసారి దేశంలో లాక్‌డౌన్ వుండకపోవచ్చని కొందరంటున్నారు. ఒక్కసారి సినిమా హాళ్ళు తెరచుకుంటే, ప్రేక్షకులు పూర్తిగా వస్తారా.? లేదా.? అన్నదానిపై క్లారిటీ వస్తుందనీ, ఆ తర్వాతే సంక్రాంతి సినిమాలు ఖరారవుతాయనీ అంటున్నారు.