సంక్రాంతి అంటే తెలుగు సినిమాకి అసలు సిసలు పండగ. నాలుగైదు పెద్ద సినిమాలు రిలీజైనాసరే ఇబ్బంది ఏమీ వుండదు. ఎన్ని సినిమాలొచ్చినా సంక్రాంతి వేవ్‌లో సందడి చేసేస్తాయ్. కానీ, గతంతో పోల్చితే ఈసారి పరిస్థితులు భిన్నం. ఇది కరోనా కాలం. ఏడు నెలలుగా సినిమా హాళ్ళు మూతపడి వున్నాయ్. ఎప్పుడు సినిమా హాళ్ళు తెరచుకుంటాయో తెలియదు. తెరచుకున్నా ప్రేక్షకులు ఎలా వస్తారో తెలియదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం సినిమా హాళ్ళు తెరిచేందుకు అనుమతిచ్చినా, తెలుగునాట ఇంకా గందరగోళం కొనసాగుతూనే వుంది. దసరా సీజన్‌ని కూడా తెలుగు సినీ పరిశ్రమ మిస్ అవుతోంది.
దీపావళిపై కాస్తో కూస్తో ఆశలున్నా, పెద్ద సినిమాలేవీ సాహసించడంలేదు. సంక్రాంతి అంటే కొంచెం దూరంలో వుంది కాబట్టి, అప్పటికి పరిస్థితులు అనుకూలిస్తాయని అంచనా వేస్తున్నారు. సినిమా చాలా సున్నితమైన బిజినెస్. ఏ చిన్న భయం పుట్టినా అంతే సంగతులు. అందుకే, ఆచి తూచి అడుగులేస్తున్నారు సినీ పెద్దలు. కాగా, రానా నటిస్తోన్న ‘అరణ్య’ సంక్రాంతి రిలీజ్‌ని లాక్ చేసింది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాకి సెన్సార్ అయిపోయింది.. సుప్రీం హీరో సాయి ధరం తేజ్ రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ‘ఆచార్య’, ‘వకీల్ సాబ్’ తదితర సినిమాలు సంక్రాంతికి విడుదల కావాల్సి వున్నా, పరిస్థితులు అనుకూలంగా లేవు. సినిమా హాళ్ళు తెరచుకుని, ప్రేక్షకులు సినిమా హాళ్ళకు రావడం మొదలయ్యాకనే, సంక్రాంతి సినిమాలపై పూర్తి స్పష్టత రావొచ్చు.