సినిమాకి కథే మూలం. కథ ఉంటే.. సగం సినిమా పూర్తయిపోయినట్టే. కథల్లేకే చిత్రసీమ అల్లాడుతోంది. ఇప్పుడు ఓ టీ టీ లోని వెబ్ సిరీస్ లకు ధీటుగా కథలు అల్లాల్సివస్తోంది. అందుకే కథలు ఎక్కడున్నా పట్టేయడానికి దర్శకులు, నిర్మాతలూ రెడీగా ఉన్నారు.
ఫలానా చోట ఓ మంచి కథ ఉందంటే, ఎన్ని లక్షలు పోసైనా కొంటున్నారు. అదే కథకులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. అందుకేనేమో ఓ సీనియర్ దర్శకుడు కథల్ని అమ్మకానికి పెట్టాడు. ఆయనే శివ నాగేశ్వరరావు. మని, సిసింద్రీ, వన్ బై టూ, పట్టుకోండి చూద్దాం లాంటి హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. కొంతకాలంగా ఆయన దర్శకత్వానికి దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ కొత్త కథలతో రెడీ అవుతున్నారు. ఆయన దగ్గర నాలుగైదు మంచి కథలు ఉన్నాయి. వాటిలో ఓ కథని ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ రెమ్యునరేషన్ ఇచ్చి కొనుగోలు చేసిందని సమాచారం. ఆ కథలో ఓ అగ్ర కథానాయకుడు కనిపిస్తార్ట. మరో కథని శివ నాగేశ్వరరావు తన దర్శకత్వంలో మొదలెడతారు. ఇందులోనూ ఓ పెద్ద హీరోనే నటిస్తారని సమాచారం. కథ బాగుంటే.. సీనియరా, జూనియరా, వెటరన్ దర్శకుడా అని ఎవరూ ఆలోచించడం లేదు. పచ్చ జెండా ఊపేస్తున్నారు. అందుకే.. శివ నాగేశ్వరరావు లాంటి సీనియర్లూ ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకోవడానికి రెడీ అయిపోతున్నారు.