గుణశేఖర్ ఆశలన్నీ ఇప్పుడు శాకుంతలంపైనే ఉన్నాయి. సమంత ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. ఈనెల 17న విడుదల కావాలి. ఇప్పటికే ఓసారి రిలీజ్ డేట్ ప్రకటించి వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి వాయిదా కోరల్లో చిక్కుకుందని టాలీవుడ్ టాక్. ఈ సినిమాని త్రీడీ లో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. త్రీడీకి సంబంధించిన వర్క్ ఇంకా పూర్తి కాలేదని, అందుకే ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే గుణశేఖర్, అతని టీమ్ అంతా ఈ సినిమాని ఇన్ టైమ్‌లోనే పూర్తి చేయాలని రాత్రింబవళ్లూ కష్టపడుతున్నారు.
మరోవైపు.. ఈ సినిమాకి బిజినెస్ కష్టాలూ ఉన్నాయి. దాదాపు రూ.70 కోట్లతో రూపొందిన సినిమా ఇది. టాలీవుడ్ లోనే కాదు, దేశం మొత్తమ్మీద అత్యంత ఖరీదైన లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇదే అని గుణశేఖర్ ప్రకటించారు. అంత రాబట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే సమంత గత చిత్రం `యశోద` బాక్సాఫీసు దగ్గర నిరాశ పరిచింది. గుణశేఖర్ రుద్రమదేవీకి అంతంత మాత్రంగా ఫలితం వచ్చింది. ఆ ప్రభావం శాకుంతలంపై పడింది. ఈ సినిమాకి అనుకొన్నంత స్థాయిలో మార్కెట్ అవుతుందా? లేదా? అనే సందిగ్థం నెలకొంది. కానీ అవుట్ పుట్ పై గుణశేఖర్ పూర్తి నమ్మకంతో ఉన్నాడు. సమంత కూడా ఈ సినిమాని ఇష్టపడి చేసింది. త్వరలోనే ప్రమోషన్లు కూడా మొదలు కానున్నాయి.