రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చక చక సాగిపోతోంది. అయితే.... సడన్ గా ఈ ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. అది కూడా కమల్ హాసన్ వల్ల. కమల్ తో శంకర్ `భారతీయుడు 2` అనే ప్రాజెక్టు మొదలెట్టిన సంగతి తెలిసిందే. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ తరవాతే... రామ్ చరణ్‌తో సినిమాని పట్టాలెక్కించాడు శంకర్. అయితే ఇప్పుడు కమల్ - భారతీయుడు 2 షూటింగ్ మళ్లీ మొదలవ్వబోతోంది. త్వరలోనే భారతీయుడు 2ని మళ్లీ మొదలెట్టి పూర్తి చేయాలని కమల్ చెప్పాడట. కమల్ ఆజ్ఞ శిరసా పాటించాలని శంకర్ ఓ నిర్ణయానికి వచ్చాడు.
కొన్ని రోజుల పాటు చరణ్ సినిమాని పక్కన పెట్టి భారతీయుడు 2పై ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడు. అలాగని రామ్ చరణ్ సినిమా పూర్తిగా వదిలేయడు. నెలలో సగం రోజులు చరణ్‌కి కేటాయిస్తే.... మిగిలిన సగం రోజుల్లో భారతీయుడు 2 పూర్తి చేస్తాడు.
అలా రెండు పడవల మీద ప్రయాణం చేయడానికి శంకర్ డిసైడ్ అయ్యాడట. అయితే ఈ నిర్ణయం పట్ల దిల్ రాజు అసంతృప్తితో ఉన్నాడని తెలుస్తోంది. ఈ యేడాది చివరి నాటికి చరణ్ సినిమాని పూర్తి చేస్తే 2023 వేసవిలో విడుదల చేసుకొనే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇలా సగం.. సగం అంటే చరణ్ సినిమా ఆలస్యం అవుతుంది. వేసవికి విడుదల చేయడం కష్టమే. పైగా ఒకేసారి రెండు సినిమాలు చేస్తే... దేనిమీద ఫోకస్ చేసే అవకాశం ఉండదు. అయితే శంకర్ నిర్ణయాన్ని కాదనలేక... ఇష్టం లేకపోయినా `ఓకే` అనేశాడట. సో.. భారతీయుడు 2 మొదలైతే, చరణ్ సినిమా పూర్తిగా స్లో పేజ్ లోకి వెళ్లిపోయినట్టే.