ఇది డిజిటల్ యుగం. సినిమాపై కూడా డిజిటల్ ప్రభావం చాలా పడింది. నాన్ థియేటరికల్ రైట్స్ అన్నీ డిజిటల్ రైట్స్‌గానే మారిపోయాయి. థియేటర్ నుంచి ఎంతొచ్చింది? అనేది ఎంత ముఖ్యమో.. నాన్ థియేటరికల్ రైట్స్ కూడా అంతే ముఖ్యం. డిజిటల్ రైట్స్ గిట్టుబాటు అయితే.. సినిమా విడుదలకు ముందే సేఫ్ జోన్‌లో పడిపోయినట్టు. ఇప్పుడు `ఆడవాళ్లూ మీకు జోహార్లూ` కూడా సేఫ్ జోన్‌లో పడిపోయింది.
శర్వానంద్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. రష్మిక కథానాయిక. కిషోర్ తిరుమల దర్శకుడు. ఈనెల 25న ఈ చిత్రం విడుదల అవుతోంది. ట్రైలర్, టీజర్ ఇంకా రాలేదు. అయితే నాన్ థియేటరికల్ రైట్స్ మాత్రం హాట్ కేకులా అమ్ముడైపోయింది. రూ.25 కోట్లకు నాన్ థియేటరికల్ రైట్స్ క్లోజ్ చేశారని సమాచారం. శర్వా కెరీర్‌లో ఇదే రికార్డ్. థియేటర్ నుంచి మరో రూ.20 కోట్లు వచ్చినా ఈ సినిమాకు లాభాల పంట పండినట్టే. ఈనెల 25న ఈ సినిమా రావాలి. అదే రోజున భీమ్లా నాయక్ కూడా రిలీజ్ డేట్ ప్రకటించారు. పవన్ సినిమా వస్తే... శర్వానంద్ డ్రాప్ అవుతాడు. లేదంటే.. 25నే ఈసినిమా వచ్చేస్తుంది.