చిత్రసీమలో సెంటిమెంట్లకు కొదవ లేదు. ఫలానా హీరో క్లాప్ కొడితే... సినిమా ఫ్లాప్ అవుతుందనుకుంటే.. అస్సలు ఆ హీరోనే ఓపెనింగ్స్‌కి పిలవరు. ఫలానా హీరో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి వస్తే.. సినిమా హిట్టనుకుంటే.. ఆ హీరోని అస్సలు వదలరు. 'గోల్డెన్ హ్యాండ్' అంటూ కితాబులు ఇస్తుంటుంది. అల్లు అర్జున్ కూడా ఇప్పుడు టాలీవుడ్‌కి గోల్డెన్ హ్యాండ్‌గా మారాడు. 'గీత గోవిందం', 'టాక్సీవాలా' ఫంక్షన్లకు అతిథిగా వెళ్లాడు బన్నీ. ఆ రెండూ హిట్లయ్యాయి. 'గీత గోవిందం' అయితే వంద కోట్లు అందుకుని టాలీవుడ్‌ని షేక్ చేసింది. అందుకే యంగ్ హీరోలు బన్నీవైపు దృష్టి పెట్టారు.
'పడి పడి లేచె మనసు' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి శర్వానంద్ బన్నీని ఆహ్వానించడానికి కూడా కారణం ఇదే. ''బన్నీని అందరూ గోల్డెన్ హ్యాండ్ అంటున్నారు. అందుకే ఫోన్ చేసి విజయ్‌దేవర కొండకు రెండు హిట్లు ఇచ్చావ్. నాకూ ఓ హిట్టు కావాలి. అందుకే టచ్ చేసి వెళ్లు’ అన్నాను. ఆ సమయంలో ముంబైలో బిజీగా ఉన్నా సరే ‘21 నే నీ సినిమా రిలీజ్ అవుతోంది. ఎంతో టైమ్ లేదు. నువ్వు ఎప్పుడంటే అప్పుడు వస్తా’ అని మాట ఇచ్చాడు. నాలాంటి చాలా మందికి బన్నీ స్ఫూర్తి. అందరూ మంచి సినిమాలు చేస్తాం. కొత్త సినిమాలు చేస్తాం.
బన్నీలో మరో ప్రత్యేకత ఉంది. వందకు నూట యాభై శాతం కష్టపడతాడు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాకుండా.. మంచి సినిమా తీశామంటే తొలి ఫోన్ బన్నీ నుంచే వెళ్తుంది'' అని బన్నీ మంచి మనసు గురించి చెప్పుకొచ్చాడు శర్వా. మరి 'పడి పడి లేచె మనసు' కూడా హిట్టయిపోతే... బన్నీ కి గోల్డెన్ హ్యాండ్ అనే పేరు మరింత గట్టిగా స్థిరపడి పోతుంది.