మొన్న సంక్రాంతికి 'గౌతమి పుత్ర శాతకర్ణి', 'ఖైదీ నెంబర్ 150' వంటి పెద్ద సినిమాలతో పోటీ పడ్డాడు యంగ్ హీరో శర్వానంద్. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'శతమానం భవతి' సంక్రాంతికి విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. మంచి లాభాల్ని ఆర్జించింది ఆ సినిమా. పెద్ద సినిమాల మధ్య నలిగిపోతుందనుకుంటే, పెద్ద సినిమాలకు దీటుగా వసూళ్ళను సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది 'శతమానం భవతి'. ఇప్పుడు 'బాహుబలి' మేనియా ఊపేస్తోన్న ఈ టైమ్‌లో శర్వానంద్ తన కొత్త సినిమా 'రాధ'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. గుంపులో గోవిందా అంటే ఏం కిక్కుంటుంది చెప్పండి. ఓ ప్రత్యేకత అంటూ ఉంటేనే అసలు కిక్కు. అందుకే పెద్ద సినిమాల మధ్యన ఏ మాత్రం భయం బెరుకూ లేకుండా దూసుకొస్తాడు శర్వానంద్. మే 12న ఈ సినిమా విడుదలవుతోంది. బాహుబలి విడుదలై రెండో వారం తిరిగినా ఇంకా జనంలో ఆ ఎఫెక్ట్ పోలేదు. చూసిన వాళ్లు మళ్లీ చూస్తున్నారు. చూడని వాళ్లు చూస్తూనే ఉన్నారు. అలా ఉంది 'బాహుబలి' మేనియా. బాహుబలి' మేనియా ఎలా ఉన్నా, 'రాధ' సినిమాతో నా దారి నాదే అంటూ స్పీడుగా ముందుకొచ్చేస్తున్నాడు. ఈ సినిమా కూడా మంచి వసూళ్ళను అందుకుంటుందని చిత్ర దర్శక నిర్మాతలు అంటున్నారు. చంద్రమోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది.