శర్వానంద్ ప్రస్తుతం 'జాను' రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంత ఈ సినిమాలో శర్వాతో జోడీ కడుతుండగా, తమిళ బ్లాక్ బస్టర్ '96'కి ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. అయితే, ఈ సినిమా కాకుండా, మనోడు మరో సినిమానీ సైలెంట్‌గా పూర్తి చేసేశాడు. అదే 'శ్రీకారం'. ఏదైనా మంచి పని చేస్తే, ఆ మంచి పనికి మనం పెట్టే సాంప్రదాయమైన పేరే 'శ్రీకారం'. ఇలాంటి ఓ మంచి టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకి కిషోర్. బి దర్శకత్వం వహిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
'గ్యాంగ్‌లీడర్' ఫేమ్ ప్రియాంకా మోహన్ ఈ సినిమాలో శర్వాతో జోడీ కడుతోంది. కాగా, ఈ సినిమా నుండి లేటెస్ట్‌గా ఓ ఫస్ట్‌లుక్ పోస్టర్ వదిలారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లుగా ఉందీ 'శ్రీకారం' పోస్టర్. గళ్ల లుంగీ, నల్ల కండువా వేసుకుని పచ్చని పొలాల మధ్య శర్వానంద్ అలా నడుచుకొస్తున్న దృశ్యమది. టైటిల్‌కి తగ్గట్లుగానే ఏదో మంచి పనికి శ్రీకారం చుడుతున్నట్లుగా పోస్టర్‌లో శర్వానంద్ ముఖం నిండుగా చిరునవ్వుతో వెలిగిపోతోంది. ఎప్పుడు పూర్తి చేశాడో తెలీదు కానీ, సినిమా చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఫస్ట్‌లుక్‌తో ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. కాబట్టి త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారట. మరోవైపు శర్వానంద్ నటిస్తున్న 'జాను' ఓ మోస్తరు అంచనాలతో త్వరలో రిలీజ్‌కి సిద్ధమవుతోంది.