నిన్నుకోరి, మజిలీ చిత్రాలతో ఆకట్టుకున్నాడు శివ నిర్వాణ. అయితే టక్ జగదీష్ బాగా నిరాశ పరిచింది. ఆ సినిమా తరవాత.. శివ నిర్వాణ మరో కథని పట్టాలెక్కించలేదు. ఐతే.. విజయ్ దేవరకొండ కి మాత్రం ఓ కథ చెప్పి ఒప్పించాడు. లైగర్ తరవాత శివ నిర్వాణ సినిమానే మొదలవ్వాలి. కానీ.. ఇప్పుడు ఈ సినిమా సందిగ్థంలో పడింది. లైగర్ తరవాత సుకుమార్ తో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు విజయ్. దాంతో శివ కొన్నాళ్లు వెయిటింగ్ లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సుకుమార్ తో సినిమా అంటే ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు. పుష్ప 2 అవ్వాలి, అప్పుడు విజయ్ సినిమా పట్టాలెక్కించాలి. కనీసం రెండేళ్ల మాట. ఈలోగా ఏం జరుగుతందో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే శివ నిర్వాణ ప్లాన్ బీని ఎంచుకున్నాడు.
ఇటీవల వెంకటేష్ ని కలిసి శివ నిర్వాణ ఓకథ చెప్పాడని టాక్. ఆ కథ వెంకీకి బాగా నచ్చిందట. దాంతో ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలెట్టేశాడు శివ. విజయ్ కంటే ముందు... వెంకటేష్ తో ఈ సినిమా పూర్తి చేయనున్నాడు శివ. ఇందులో వెంకీ ఓ డాక్టర్ గా కనిపించబోతున్నాడని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. విజయ్ - సుకుమార్ సినిమా అయిన తరవాత.. అప్పుడు శివ నిర్వాణతో విజయ్ దేవరకొండ సినిమా పట్టాలెక్కుతుంది.