ఈమధ్య సినిమాల విషయంలో భాషా భేదాలు చెరిగిపోతున్నాయి. ప్యాన్ ఇండియా స్కేల్ సినిమాలు, రెండు మూడు భాషల్లో రిలీజ్ చేసే సినిమాల జోరు పెరుగుతోంది. తాజాగా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో బడా స్టార్ అయిన శివరాజ్ కుమార్ ఓ కన్నడ - తెలుగు ద్విభాషా చిత్రంలో నటించేందుకు రెడీ అయ్యారు. శివరాజ్ కుమార్ ఇప్పటివరకు తెలుగుపై పెద్దగా దృష్టి సారించలేదు కానీ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అందులో ఒకటి 'కిల్లింగ్ వీరప్పన్' కాగా మరొకటి 'గౌతమీపుత్ర శాతకర్ణి'. బాలకృష్ణ హీరోగా నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించారు శివరాజ్ కుమార్.
ఇదిలా ఉంటే తాజాగా నూతన దర్శకుడు రామ్ ధూలిపూడి రూపొందించనున్న ఒక చిత్రంలో నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాను హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త శ్రీకాంత్ ధూలిపూడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని సమాచారం. తెలుగు- కన్నడ ద్విభాషా చిత్రంగా రూపొందే చిత్రం కాబట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యేలా కొందరు తెలుగు నటీనటులను తీసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారట.
కన్నడ ఇండస్ట్రీ లోని హీరోలలో ఉపేంద్ర, సుదీప్, యష్ మన ప్రేక్షకులకు పరిచయం ఉన్నవారు. మరి వారి బాటలోనే శివ రాజ్ కుమార్ కూడా ఈ సినిమాతో గుర్తింపు సాధిస్తాడా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.