ప్రభాస్ ఆదిపురుష్ భారీ ట్రోలింగ్ కి గురైన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో వాడిన విజువల్ ఎఫెక్ట్స్ పై బోలెడన్ని మీమ్స్ బయల్దేరాయి. నిజానికి ఆదిపురుష్ గ్రాఫిక్స్ చీప్‌గా కనిపించాయి. ఆ విషయంలో సందేహమే లేదు. ఆ సినిమా బడ్జెట్ కీ, ఇచ్చిన బిల్డప్‌కీ, వచ్చిన హైప్‌కీ.. విజువల్స్ కీ అస్సలు సంబంధమే లేకుండా పోయింది. కాకపోతే ఆర్గానిక్ గా వచ్చిన మీమ్స్, ట్రోల్స్ కొన్నయితే... కొన్ని పెయిడ్ ట్రోల్స్ అన్న సంగతి ఈమధ్యే బయటకు వచ్చింది. వీటి వెనుక ఓ దర్శకుడు ఉన్నాడని, తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ... ఈ సినిమాను ట్రోల్ చేయించాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఆ సమయంలోనే విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న మరో సినిమా సెట్స్‌పై ఉంది. ఆ రెండు సినిమాల్నీ పోలుస్తూ.. ఈ ట్రోలింగ్ జరిగిన సంగతినీ వాళ్లు గుర్తు చేస్తున్నారు. ఆదిపురుష్‌ని ట్రోల్ చేస్తూనే, అదే సమయంలో మరో సినిమాకు హైప్ తీసుకురావడం కోసం ట్రోలింగ్ పై బడ్జెట్ కుమ్మరించారని తెలుస్తోంది. నిజానికి ఇదో వికృతమైన పోకడ. తమ సినిమాని పబ్లిసిటీ చేసుకోవడం, అందుకోసం ఎంతైన ఖర్చు పెట్టడం వరకూ ఓకే. కానీ మరో సినిమాని పోలుస్తూ, కించపరుస్తూ తమ సినిమాకు హైప్ తీసుకురావాలనుకోవడం మాత్రం దారుణమైన పోకడ. ఇండస్ట్రీలో ఇలాంటి ఓ వర్గం ఇప్పుడు తయారవుతోంది. తమ సినిమాకు క్రేజ్ తీసుకురావడం ఎలా? అనే విషయం మర్చిపోయి, పక్కవాళ్ల సినిమా ట్రోలింగ్ కోసం భారీగా ఖర్చు పెట్టడం కోసం ప్రయత్నాలు మొదలెడుతున్నారు. ఈ ట్రెండ్ ఎంత వరకూ వెళ్తుందో మరి.