సోషల్ మీడియా వచ్చాక.. సెలబ్రెటీ స్టేటస్ రావడం చాలా ఈజీ అయిపోయింది. ఎవరిలో ఏమాత్రం ప్రతిభ ఉన్నా - చటుక్కున ప్రపంచానికి తెలిసిపోతోంది. చిన్న ట్వీట్, చిన్న కామెంట్, ఓ ఫొటో.. కూడా వైరల్ గా మారుతున్నాయి. అలా.. సెలబ్రెటీ అయిన వాళ్లలో రణు మండల్ ఒకరు.
పశ్చిమ బెంగాల్‌లోని రాణాఘాట్ రైల్వేస్టేషన్‌లో పాటలు పాడుకుంటూ బిక్షాటన చేసుకునే రణు.. వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఎంతగా అంటే.. ఈమె ప్రతిభ చూసి బాలీవుడ్ ముక్కన వేలేసుకుంది. ఆమె అడ్రస్ వెదికి పట్టుకుని మరీ.. స్టూడియోలకు రప్పించింది. హిమేష్ రేష్మియాతో కలిసి ఓ పాట పాడింది రణు. ఆపాట సూపర్ హిట్. దాంతో తనకు చాలా అవకాశాలు వచ్చాయి. ఒక్కసారిగా తన లైఫ్ మారిపోయింది. బాలీవుడ్ టీవీ ఛానళ్లు ఆమెను అతిథిగా ఆహ్వానించి సత్కారాలు చేశాయి. దాంతో రణు ఓ సెలబ్రెటీ అయిపోయింది.
అయితే.. ఎంత త్వరగా ఎదిగిందో, అంతే త్వరగా పతనాన్నీ చూసింది. టక టక నాలుగైదు సినిమాల్లో పాటలు పాడేసిన రణు.. ఆ తరవాత ఒక్కసారిగా కనుమరుగైపోయింది. ఇప్పుడు ఆమెని పిలిచి పాట ఇచ్చేవాడు లేడు. పట్టించుకునేవాడూ లేడు. ఇప్పుడామె మళ్లీ తన సాధారణమైన జీవితానికి వెళ్లిపోయింది. స్టార్ అయ్యాక ఆమె ప్రవర్తన, చూపించిన స్టేటస్ విమర్శల పాలైంది. ఓ అభిమాని సెల్ఫీ కోరితే.. దారుణంగా అవమానపరిచింది. ఆ విషయం సైతం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చేతికి సడన్ గా డబ్బు వచ్చేసరికి.. విలాసాలు చేసిందని, అతిగా మేకప్ వేసుకుని, ఆర్టిఫిషియల్ గా కనిపించడం మొదలెట్టిందని, క్రమంగా సంగీత దర్శకులు, సినీ ప్రపంచం ఆమెని పట్టించుకోవడం మానేసిందని, అలా పాటలకు దూరమైందని తెలుస్తోంది. ప్రతిభ ఉంటే సరిపోదు. అవకాశాలు రావాలి. అవకాశాలు వస్తే చాలదు. నిబ్బరంగా వాటిని నిలబెట్టుకోవాలి. ఈ విషయంలో.. రణు మండల్ విఫలమైందనే చెప్పుకోవాలి.