ఓ దర్శకుడి మీద తప్పదు గనుక పొగడ్తలు గుప్పించడంలా కాకుండా, ఆ దర్శకుడి పని తీరుకి ఫిదా అయిపోవడమే కాకుండా, అతన్ని గురువుగా భావించడం అంటే చిన్న విషయం కాదు. ఓ సూపర్ స్టార్, ఓ దర్శకుడి మీద ఇంత అభిమానం చూపించడం నిజంగానే గ్రేట్. అందుకే మహేష్‌బాబు సూపర్ స్టార్ అయ్యారు. సినిమా చేసేందుకు పూర్తి విశ్వాసం ఆ సినిమా దర్శకుడి మీద హీరోకి ఉండాలి. హీరోకి మాత్రమే కాదు, నటీనటులంతా దర్శకుడి మీద భరోసాతో ఉండాలి. పూర్తిస్థాయిలో దర్శకుడికి మిగిలిన విభాగాల నుంచీ సపోర్ట్ ఉంటే ఏ సినిమా అయినా ఆణిముత్యమే అవుతుంది. మహేష్ లాంటి స్టార్ ఓ కొత్త కుర్రాడిలా మురుగదాస్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవడం అభినందనీయం. నేర్చుకోవడం ఒక ఎత్తు, ఆ నేర్చుకున్న విషయాల గురించి మహేష్ చెప్పడం ఇంకో ఎత్తు. మహేష్ సింప్లిసిటీకి ఇది నిదర్శనం. 'స్పైడర్' సినిమా చిత్రీకరణ సందర్బంగా ఏయే టెక్నీషియన్‌తో ఎలాంటి అనుభవం తాను చవిచూశానో మహేష్, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వివరంగా తెలియజేశారు. అందరికన్నా మిన్నగా మురుగదాస్, 'స్పైడర్' సినిమాని టేకప్ చేసిన విధానం మహేష్‌కి చాలా బాగా నచ్చేసిందట. కొట్టేస్తున్నాం, ఖచ్చితంగా సత్తా చాటేస్తాం అని మహేష్ చెప్పడంలోనే 'స్పైడర్' సినిమాపై మహేష్‌కి ఉన్న నమ్మకమేంటో అర్థవుతుంది.