సాధారణమైన పనే, ఈసారి కొత్త పరిస్థితుల్లో చేస్తున్నాం.. అని సింపుల్‌గా చెప్పేశాడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి మాట్లాడుతూ. 'ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఒక్కోసారి ఎక్కువ సినిమాలు పోటీ పడేవి. ఏ శుక్రవారం కూడా ఖాళీగా వుండేది కాదు. కానీ, ఇప్పుడలా కాదు. చాలా నెలల నుంచి ఖాళీగా వున్నాం. అందుకే, కొత్తగా అనిపిస్తోంది. ఎప్పుడూ చేసే సనే, కొత్తగా.. కొత్త కొత్త భయాలతో చేస్తుండడం బాధగానే వున్నా.. తప్పడంలేదు..' అంటూ సాయి ధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' గురించి చెప్పాడు. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన 'సోలో బ్రతుకే సో బెటర్' నిజానికి గత మే నెలలో విడుదలవ్వాల్సి వుంది. కరోనా నేపథ్యంలో వాయిదా పడి, ఇప్పుడు.. ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
పెద్దయెత్తున ధియేతర్లకు అభిమానులు పోటెత్తడాన్ని బహుశా ఇప్పుడు చూడలేం. ఎందుకంటే, సినిమా థియేటర్లలోకి సగం మంది ప్రేక్షకుల్ని మాత్రమే రానిస్తారు. సగం ఆక్యుపెన్సీ అనే నిబంధన పరిశ్రమకు ఏమాత్రం మేలు చేయదు. అయితే, 'ఏమీ లేకపోవడం కంటే, ఎంతో కొంత బెటర్ కదా..' అని హీరోయిన్ నభా నటేష్ చెప్పిందీ వాస్తవమే. 'సోలో బ్రతుకే సో బెటర్'తోనే తెలుగు సినీ పరిశ్రమకి న్యూ బిగినింగ్ అనుకోవచ్చేమో.! ఎందుకంటే, ఈ సినిమా సాధించే వసూళ్ళను బట్టి, తదుపరి సినిమాలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీలుంటుంది.