డ్రగ్స్ రగడ బాలీవుడ్‌నే కాదు, సౌత్ సినీ పరిశ్రమను కూడా కుదిపేసేలా వుంది. బాలీవుడ్‌లో రియా చక్రవర్తిపై డ్రగ్స్ ఆరోపణలు రాగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు రియాను విచారణ చేసి అరెస్ట్ చేశారు, కన్నడ సినీ పరిశ్రమలో ఇప్పటికే నటి రాగిణి ద్వివేదిని అరెస్ట్ చేశారు. నటి సంజనపైనా ఆరోపణలున్నాయి. ఏ క్షణాన అయినా సంజన అరెస్ట్ తప్పకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. సంజన పలు తెలుగు సినిమాల్లోనూ నటించింది.
కాగా, తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఓ నటిపైనా డ్రగ్స్ ఆరోపణలు వెల్లువెత్తుతుండడం గమనార్హం. టాలీవుడ్‌కీ డ్రగ్స్ లింకులున్నాయంటూ కోలీవుడ్ మీడియా, శాండల్ వుడ్ మీడియా కోడై కూస్తుండడంతో.. ఇక్కడా డ్రగ్స్ ప్రకంపనలు కన్పించే అవకాశం లేకపోలేదు. అయితే, కొన్నాళ్ళ క్రితం టాలీవుడ్‌కి డ్రగ్స్ మరక అంటుకోవడం మినహాయిస్తే, ఆ తర్వాత మళ్ళీ అలాంటి ప్రకంపనలేవీ కన్పించలేదు. ‘సినీ పరిశ్రమ మీదనే ఎందుకీ దుష్ప్రచారం..’ అని బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా, తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖుల తరఫున కూడా ఓ ప్రకటన వస్తే బావుండేదన్న వాదన బలంగా విన్పిస్తోంది. ‘మమ్మల్ని ఎందుకు ప్రత్యేకంగా చూస్తారు.? మేమూ సమాజంలో భాగమే.
ఒకరిద్దరు తప్పు చేస్తే, దానికి సినీ పరిశ్రమ మొత్తాన్ని ఎలా బాధ్యత వహించాలని అడుగుతారు.?’ అన్నది కొందరు సినీ ప్రముఖుల ప్రశ్న. ‘తప్పు చేస్తే, శిక్ష తప్పదు.. అలాగని అందర్నీ ఒకే గాటన కట్టేయొద్దు..’ అన్నది సినీ పరిశ్రమ వాదనగా కన్పిస్తోంది. ఏమో, రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోగానీ, ఫలానా నటి అరెస్ట్ కాబోతోంది.. ఫలానా హీరో అరెస్ట్ కాబోతున్నాడంటూ టాలీవుడ్ గురించీ సోషల్ మీడియాలో పుకార్లు హల్‌చల్ చేస్తుండడం దురదృష్టకరమే.