హీరోగా నటించాలని ఎవరికి ఉండదు? విలన్లు, దర్శకులు, డాన్స్ మాస్టర్లు హీరోలుగా మారడానికి తెగ తాపత్రయపడిపోతుంటారు. అయితే హీరోగా నటించే అవకాశం వచ్చినా ఒకాయన కాదనుకున్నారు. `ఈ కథ నాకు సెట్ అవ్వదండీ` అని తప్పించుకున్నారు. ఆయనే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.
యండమూరి రాసిన నవల `భార్య గుణవతి శత్రు`. అందులో హీరో పాత్ర పేరు బాలు. ఈ పాత్రని.. బాలుని దృష్టిలో ఉంచుకునే రాశాడు యండమూరి. అన్నట్టు యండమూరి కథలోని హీరో కూడా గాయకుడే. ఈ సినిమాని బాలు హీరోగా చేయిస్తే బాగుంటుందని భావించారు. ఈ కథని ఆయనకు వినిపించారు కూడా. కానీ బాలు మాత్రం... `నాపై ఈ కథ వర్కవుట్ అవ్వదు` అని సున్నితంగా చెప్పి తప్పించుకున్నారు. అప్పుడు గనుక.. ఈ కథ బాలు ఒప్పుకుంటే.. బాలుని ఎప్పుడో నటుడిగా, అందునా ఓ హీరోగా చూసేవాళ్లం. అయితే ఆ తరువాత కొన్నేళ్లకు ఈ నవలని ధారావాహికగా తీశారు. బాలు కూడా గాయకుడిగా రాణిస్తూనే, నటుడిగా కొన్ని సినిమాల్లో కీలకమైన పాత్రలు పోషించారు.