దిగ్గజ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. తమిళ కథానాయకుడు అర్జున్ ఈ విషయమై తొలిగా గళం విప్పారు. ఆ తరవాత.. మెల్లమెల్లగా అందరి నోటా.. ఇదే మాట వినిపిస్తోంది. తాజాగా సీఎం జగన్ కూడా బాలు కి భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ వినిపించారు. ఈ మేరకు కేంద్రానికి ఓ లేఖ కూడా రాశారు. తెలుగువాళ్లంతా ఏకమై.. భారతరత్న కోసం గట్టిగా డిమాండ్ చేస్తే... అది సాధ్యం అవుతుంది కూడా.
బాలుకి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌పై తనయుడు ఎస్.పి.చరణ్ స్పందించారు. ``మానాన్నగారే లేనప్పుడు భారతరత్నలు మాకెందుకు? ఆయనే మా భారతరత్న. మా నాన్నగారికి ఆ పురస్కారం ఇవ్వడమూ, ఇవ్వకపోవడము కేంద్రం ఇష్టం. ఇస్తే మంచిదే`` అంటూ లైట్ తీసుకున్నాడు. తన తండ్రికి చిహ్నంగా ఫామ్ హౌస్ లో ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, అందుకు సంబంధించిన చర్చలు సాగుతున్నాయని వెల్లడించారు.