యదార్ధ ఘటనలని తన సినిమాల్లో చూపించడం ద్వారా రామ్ గోపాల్ వర్మ క్రియేటివిటీ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికే చాలా యదార్ధ ఘటనల్ని ఆయన తన సినిమాల ద్వారా చూపించేశారు. పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'రక్త చరిత్ర' సినిమాతో బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఓ సెన్సేషన్ అయ్యింది 'రక్త చరిత్ర' సినిమా. ఆ తర్వాత 'వంగవీటి' పేరుతో తెరకెక్కించిన వంగవీటి గాధ, 'వీరప్పన్' తదితర సినిమాలతో ఆ తరహా సినిమాలు తీయడంలో తాను దిట్ట అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. జయాపజయాలకు అతీతంగా ఆయా యదార్ధ గాధల్లోని ఇంటెన్సిటీని ఆయన తన సినిమాల్లో క్యారీ చేసిన వైనాన్ని మెచ్చుకోకుండా ఎవరూ ఉండలేరు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేరా బాబా అలియాస్ గుర్మీత్ సింగ్ మీద వర్మ ఓ సినిమా తెరకెక్కిస్తారనే గాసిప్స్ ప్రచారంలోకి వచ్చాయి. వర్మ అయితేనే డేరా బాబా సినిమాకి న్యాయం చేయగలడని నెటిజన్లూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. అయితే వర్మ నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటనా రాలేదు డేరా బాబా గురించి. గతంలో గ్యాంగ్‌స్టర్ నయీం మీద సినిమా తీయనున్నట్లు వర్మ ప్రకటించినా అది ప్రారంభం కాలేదు. అలాగే జయలలిత మరణానంతరం శశికళ పేరుతో సినిమా తీస్తానని చెప్పిన వర్మ ఆ విషయాన్నీ పక్కన పెట్టేసినట్లు అనిపిస్తోంది. కాబట్టి వర్మ నుంచి 'డేరాబాబా'పై స్పందన వచ్చేదాకా గాసిప్స్ కొనసాగుతుంటాయ్.